బాణాపురంలో గీత కార్మికుల సమస్యలు విన్నాక కల్లు రుచి చూస్తున్న భట్టి విక్రమార్క
మధిర /ముదిగొండ: భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరముందన్న సీఎం కేసీఆర్.. రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఆరో రోజుకు చేరింది. ముదిగొండ మండలంలోని బాణాపురం, వల్లబి, మల్లారం గ్రామాల్లో పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలతో పాటు వల్లబిలో భట్టి విలేకరులతో మాట్లాడారు.
రాజ్యాంగం పటిష్టంగా ఉంటే తన రాచరిక వ్యవస్థ నడవదని కేసీఆర్ ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం ఎందుకని భావించే ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనా విధానాల అమలు కోసం రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సుబ్రహ్మణ్యస్వామితో కేసీఆర్ సమావేశం కావడం వెనుక ఇదే కుట్ర దాగి ఉందని భట్టి ధ్వజమెత్తారు. ఇలాంటి వారితో దేశానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పి కొట్టడానికి లౌకికవాదులు, ప్రజాస్వామిక వాదులు ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు నటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు సమస్యలను పరిష్కరించలేని సీఎం కేసీఆర్, జాతీయ స్థాయిలో రైతు సమస్యలపై ఉద్యమిస్తానని టికాయత్‌తో సమావేశం కావడం హాస్యాస్పదమని అన్నారు. కాగా, పాదయాత్రలో బాణాపురంలోని కల్లుగీత కార్మికులు భట్టి విక్రమార్కకు స్వాగతం పలికి తమ సమస్యలు వివరించారు.
తాటి చెట్లు ఎక్కడానికి ఎలక్ట్రానిక్ మోకులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట మరచిపోయిందని వారు అన్నారు. చెట్టు పైనుంచి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఏడాదైనా ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోగా, తాటివనాలకు మూడు ఎకరాలు భూమి కేటాయింపు కూడా చేయలేదని, విచ్చలవిడిగా వైన్స్‌లు, ఊరూరా బెల్టు షాపుల ఏర్పాటుతో తమ వృత్తి కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు. సమస్యలు వివరించాక గీత కార్మికుల విజ్ఞప్తితో భట్టి విక్రమార్క కల్లు రుచి చూశారు.
Comments
Please login to add a commentAdd a comment