కాలం మారింది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన కొందరు మహిళలు బయటకొస్తున్నారు. తల్లిదండ్రుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పిల్లల పోషణకు తమవంతు బాధ్యతలు నెరవేర్చుతున్నారు. బిడ్డల పెళ్లిళ్లు.. ఉద్యోగాల వరకు నెట్టుకొస్తున్నారు. పెద్దగా చదువుసంధ్యలు లేకపోయినా దిగులు చెందక.. కష్టాన్నే నమ్ముకుంటున్నారు. తమకు తోచిన రంగాన్ని ఎంచుకుని గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొన్ని పురుషులకే పరిమితమైన రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో ఇలాంటివారు పదుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా మహరాణులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– సాక్షి, తిరుపతి
తిరుపతి కొర్లగుంటలో.....
తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న రెడ్డెమ్మ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో సుమారు పదేళ్లుగా నాదస్వర విధ్వాంసురాలుగా పనిచేస్తున్నారు. ఈమె పుట్టింది పెరిగింది అన్నమయ్య జిల్లా పీలేరు. తండ్రి మల్లయ్య నాదస్వర విధ్వాంసులు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలుకాగా పెద్ద కుమార్తె రెడ్డెమ్మ. రెండో కుమార్తె సుభాషిణి. తన తండ్రి వద్ద రోజుకు 40 మందికికిపైగా నాదస్వరంలో శిక్షణ తీసుకునేవారు. వారితోపాటే రెడ్డమ్మ, సుభాషిణి నాదస్వరం నేర్చుకున్నారు. తిరుపతి సంగీత కళాశాలలో డిప్లొమో పూర్తిచేశారు.
గంగమ్మ ఆలయంలో నాదస్వర విధ్వాంసురాలు
కాగా రెడ్డెమ్మను తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నాదస్వర విధ్వాంసురాలుగా దేవదాయశాఖ నియమించింది. సుమారు పదేళ్లుగా ఆమె విధులు నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. నాన్న నేర్పిన నాదస్వరం ఇప్పుడు జీవనాధారమైందని, ప్రభుత్వ ఉద్యోగిగా వేతనం తీసుకుంటూ.. కుమార్తెకు వివాహం జరిపించానని చెబుతోంది. తన భర్త విశ్వనాథం కూడా నాదస్వర విధ్వాంసులే కావడం విశేషం. సోదరి సుభాషిణి కూడా నాదస్వరంలో రాణిస్తున్నట్లు రెడ్డెమ్మ ఆనందం వ్యక్తం చేశారు.
-------
టీ తాగాలంటే లక్ష్మీదేవీ దగ్గరకు రావాల్సిందే
తిరుపతి కొర్లగుంటలో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి పదేళ్లుగా టీ దుకాణం నడుపుతున్నారు. తండ్రి పాడి రైతు. పితికిన పాలను లక్ష్మీదేవి టీ అంగళ్లకు విక్రయించేవారు. అదే సమయంలో టీ, కాఫీ కొట్టు పెడితే బాగుంటుందని భావించారు. నివాసానికి సమీపంలో సొంతంగా టీ దుకాణాన్ని నడపడం ప్రారంభించారు.
టీ, కాఫీని రుచిగా తయారు చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. రోజూ 500 మంది వరకు టీ, కాఫీ తాగి వెళ్తున్నారని.. ఈ దుకాణమే ఇప్పుడు తమ జీవనాధారమని చెబుతున్నారు. భర్త ప్రకాష్ చేదోడు వాదోడుగా ఉంటున్నారని, ఇద్దరు కుమారులను చదవించి ప్రయోజకుల్ని చేశానని అంటున్నారు. ఇద్దరు కుమారులు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
--------
తల నీలాల కార్యక్రమంలో వారసత్వం
తండ్రి తదనంతరం ఆస్తులు, ఉద్యోగాలతో పాటు అనేక కార్యక్రమాలకు కుమారులే వారసులుగా వ్యవహరిస్తుంటారు. తిరుమల కళ్యాణకట్టలో కొందరు మహిళలు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. పురుషులతో దీటుగా రాణిస్తున్నారు. శ్రీవారి భక్తుల తలనీలాలు సమర్పించుకునే కార్యక్రమంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు.
అదేవిధంగా చెవిపోగులు కుట్టే కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటున్నారు. ఇలా తిరుమలో సునీత, గజలక్ష్మి 12 ఏళ్లుగా చిన్నారులకు చెవిపోగులు కుట్టే వృత్తిలో రాణిస్తుంటే.. లత, నిర్మల, నాగలాక్షి వంటి మహిళలు క్షురకులుగా వారి వారి వృత్తుల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment