కాలువలో పడి వ్యక్తి మృతి
గూడూరు రూరల్: గూడూరు రూరల్ పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామ సమీపంలో ఓ వ్యక్తి నీటి కాలువలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్‌ఐ మనోజ్‌కుమార్ కథనం.. గ్రామానికి చెందిన కటకం సుబ్రహ్మణ్యం (50) కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నాడు. పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతను గ్రామ సమీపంలో ఉన్న నీటి కాలువ గట్టున పశువులు మేపే సమయంలో అతనికి పిట్స్ వచ్చి నీటిలో పడిపోయాడు. ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్‌లకు తెలియజేశారు. మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
నేడు లక్ష బిల్వార్చన,
కుంకుమార్చన
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం లక్ష బిల్వార్చన, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ అలంకార మండపంలో జరిగే ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
ఉద్యోగ నైపుణ్యతకు
ప్రత్యేక శిక్షణ
తిరుపతి అర్బన్: విద్యార్హతను బట్టి ఉద్యోగ నైపుణ్యత సాధించడానికి వీలుగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ విభాగం జిల్లా అధికారి లోకనాథం తెలిపారు. జీఎన్‌ఎం మూడేళ్లు, బీఎస్సీ నర్సింగ్ రెండేళ్లు చదువుకున్న వారిని జర్మనీ దేశానికి పంపడానికి ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. స్విమ్స్ నర్సింగ్ కళాశాల వద్ద శిక్షణ ఉంటుందన్నారు. జర్మనీ భాషను సైతం నేర్పిస్తారని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచితంగా భోజన వసతులు కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు బయోడేటాతోపాటు విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, అనుభవ సర్టిఫికెట్, వివాహ ధ్రువీకరణ పత్రం, నోటరీ లెటర్, నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్ తదితర వాటిని సమర్పించాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందని, డిసెంబర్ 1వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. సమాచారం కోసం 91 60912690లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment