కాసుక్కూర్చున్నారు!
తిరుపతి అర్బన్ : ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో సబ్‌రిజిస్ట్రార్ల్ల తీరును తప్పుపడుతున్నారు. డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నప్పటికీ ఏదో ఒక వంకను చూపి రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కేవలం కాసుల కోసమే సాకులు చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు అడిగింది ఇచ్చేస్తే వెంటనే పని అయిపోతోందని వెల్లడిస్తున్నారు. అయితే వారు చెప్పింది ఇస్తే అలాంటి ఇబ్బందులు తప్పుతున్నాయి. జిల్లాల పునర్విభజన నాటి నుంచి తిరుపతి జిల్లాలో రిజిస్ట్రేషన్ల జోరుగా సాగుతున్నాయి. అందుకు తోడు తాజాగా వచ్చే డిసెంబర్ నుంచే భూముల రిజిస్ట్రేషన్ ధరలు భారీగా పెంచుతున్నారని పత్రికల్లో వస్తున్న కథనాలపై క్రయవిక్రయదారులు ముందే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. జిల్లాలో 12 సబ్‌రిజిస్టర్ కార్యాలయాలున్నాయి. ఏడాదిలో వివిధ అంశాలకు సంబంధించి లక్షకుపైగా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఏటా రాబడి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేరకు వస్తోంది. 2020–21 ఈ రెండేళ్లు మాత్రమే కోవిడ్ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల జోరు తగ్గింది. జిల్లాలో ప్రధానంగా తిరుపతి, రేణిగుంట, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, గూడూరు, చంద్రగిరి, వెంకటగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికంగా రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా ఈ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అన్ని కార్యాలయాల్లోను సీసీ కెమెరాలు అమర్చారు. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా అడ్డగోలు పనులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే అవినీతికి అడ్డాగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మారుతున్నాయని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో
లంచావతారులు
పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ
వంకలు పెడుతున్న ఉద్యోగులు
హల్‌చల్ చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు
తిరుపతిలో ఇక్కట్లు అధికం
తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం రోజురోజుకు కష్టంగా మారుతోందని పలువురు కొనుగోలుదారులు వాపోతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నప్పటికీ పక్కన పెట్టేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో రోజుకు 200 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవని, అయితే ప్రస్తుతం 20 నుంచి 30 మాత్రమే పూర్తవుతున్నాయని వెల్లడిస్తున్నారు. తిరుపతిలో ఇద్దరు సబ్ రిజిసా్‌ట్రర్లు ఉన్నప్పటికీ పనుల్లో జోరు లేదని ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రెండు మూరు రోజులపాటు కార్యాలయానికి తిరగాల్సి వస్తుందని మండిపడుతున్నారు. మరోవైపు రాత్రి పది గంటల వరకు ఉద్యోగులు కార్యాలయంలోనే ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్ల వ్యవహారం పూర్తి అయినప్పటికీ రాత్రి వేళల్లో కూడా అక్కడే ఉండడమేంటని చర్చించుకుంటున్నారు.. అలాగే ప్రైవేటు వ్యక్తుల దందా కూడా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల బాధ్యతలను వీరే చేపట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment