ఎర్రచందనం దుంగలు స్వాధీనం
– ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్
తిరుపతి మంగళం : అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ జీ.బాలిరెడ్డి పర్యవేక్షణలో కడప సబ్‌కంట్రోల్‌లోని ఆర్‌ఐ ఎం.చిరంజీవులకు చెందిన ఆర్‌ఎస్‌ఐ పీ.నరేష్ టీమ్, ఎఫ్‌బీఓ జీ.కిరణ్ కుమార్‌తో కలసి అన్నమయ్య జిల్లా, రాజంపేట పరిధిలోని ఎస్‌ఆర్‌పాళెం సెక్షన్‌లో కూంబింగ్ చేపట్టారు. రోళ్లమడుగు బీట్ వద్ద ఎరచ్రందనం దుంగలను మోసుకుని వస్తున్న స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. వారిలో కొందరు పారిపోగా ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ బాలిరెడ్డి తెలిపారు. వారు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించినట్టు వెల్లడించారు. వారి నుంచి ఎనిమిది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్‌కు తరలించగా, సీఐ సురేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
గంజాయి స్వాధీనం
నారాయణవనం: రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రాజ్‌కుమార్(28) అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర తెలిపారు. గురువారం ఎస్‌ఐ రాజశేఖర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం పాలమంగళం వద్ద అరుణానది సమీపంలో సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టామన్నారు. నది ఒడ్డున తచ్చాడుతున్న రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడు మండలంలోని మిట్టనైనారుకండ్రిగకు చెందిన జడబిళ్ల రాజకుమార్‌గా గుర్తించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment