తిరుపతి రూరల్ : మండలంలోని వేదాంతపురం సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రెండు కార్లు ప్రమాదశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎవరూ గాయపడలేదు. అయితే వాహనాల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ఓ హెడ్ కానిస్టేబుల్ వచ్చారు. అయితే కారు ప్రమాదంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నలుగురు యువకులు సదరు పోలీసుపై చిరాకు పడి కాలర్ పట్టుకుని దురుసుగా ప్రవర్తించారు. దీనిపై హెడ్ కానిస్టేబుల్ పై అధికారులకు ఫిర్యాదు చేయగా, యువకులపై క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలు.. సుండుపల్లెకు చెందిన సాయికుమార్ తన కుటుంబంతో కలిసి ఆర్‌సీ పురం నుంచి తిరుపతికి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో వేదాంతపురం కూడలి వద్ద చంద్రగిరి నుంచి రేణిగుంట వైపు వస్తున్న కారు ఢీకొంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు హెడ్ కానిస్టేబుల్ కోదండరామయ్య, మరో నలుగురు సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చారు. అదే ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులు జయచంద్రారెడ్డి, మునిబాలాజీ, అన్వర్‌బాషా, లోకేష్‌రెడ్డి అసహనంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ కోదండరామయ్య తన విధులు అడ్డుకున్నారని, సెల్‌ఫోన్ , మ్యాన్‌ప్యాక్‌ను లాక్కునేందుకు యత్నించారని, చొక్కా పట్టుకున్నారని ఫిర్యాదు చేశారు. ఆ మేరకు యువకులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ చిన్నగోవిందు తెలిపారు. యువకుల ప్రవర్తన కారణంగా ప్రమాదమనే చిన్న కేసు కాస్తా, క్రిమినల్ కేసుగా మారి పెద్దదైందని పలువరు పోలీసులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. క్షణికావేశంలో పోలీసులపై మండిపడ్డామని, అసలే ప్రమాదం జరిగి బాధలో ఉన్న తమపై క్రిమినల్ కేసు నమోదు చేయడం భావ్యం కాదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ముగిసిన అనస్తీషియా
నేషనల్ కాన్ఫరెన్స్
తిరుపతి తుడా : బీహార్‌లోని పాట్నాలో వారం రోజులగా నిర్వహిస్తున్న అనస్తీషియా నేషనల్ కాన్ఫరెన్స్ ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల అనస్తీషియా విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి సుమారు 60 మంది వైద్యులు హాజరైన కాన్ఫరెన్స్‌లో ఆయన పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. శ్రీనివాసరావు మాటాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను కాపాడే పద్ధతులపై సామాన్య ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాన్ని తయారుచేసినట్లు వెల్లడించారు. 7801011972 నంబర్‌కు పోన్ చేస్తే తమ టీమ్ వారికి శిక్షణ ఇస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment