ముక్కంటి దర్శనానికి 3 గంటలు
శ్రీకాళహస్తి: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ముక్కంటి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివయ్య సన్నిధి చెంత నిద్రించేందుకు ఆదివారం సాయంత్రమే పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి దాదాపు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. దళారులను కట్టడి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. సుమారు 40 వేలమందికి పైగా భక్తులు రాగా.. ఐదు రకాల రాహు–కేతు సర్పదోష పూజలు 4,169 జరిగాయి. 257 మంది అభిషేకం పూజల్లో పాల్గొన్నారు. రూ.200 కూలైన్ కంచుగడప వద్ద సర్వదర్శనంతో కలిపేయడంతో భక్తులు గందరగోళానికి గురయ్యారు.
వెనుదిరిగిన డోనర్లు
దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు విరాళాలు ఇవ్వడానికి విరాళాల కేంద్రానికి వచ్చారు. అయితే అక్కడ యూపీఐ స్కానర్లు లేకపోవడంతో వెనుదిరిగారు. అధికారులు దేశం మొత్తం యూపీఐ స్కానర్లు పెడుతుంటే శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
దూసుకొచ్చిన ట్రాక్టర్
శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం కావడంతో సుపథ మండపం వద్ద భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఓ ట్రాక్టరు పెంకులు నింపుకుని భక్తుల మధ్యలోకి దూసుకువచ్చింది. పక్కకు జరగాలని పెద్దగా అరుస్తూ కన్నప్ప తిప్ప వైపు వెళ్లింది. రద్దీ ఉన్న సమయంలో కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తూ అధికారులు అనుమతించడం సరికాదని భక్తులు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment