అదనపు గంట.. అందరికీ మంట!
పాఠశాలల్లో అదనపు పనివేళలు
● జిల్లా వ్యాప్తంగా 34 పాఠశాలల్లో అమలు ● మండిపడుతున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
తిరుపతి ఎడ్యుకేషన్ : తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆందోళనలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. పాఠశాలల్లో అదనపు పనివేళలకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 34 పాఠశాలల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనివేళలు పెంచి అమలు చేస్తోంది. దీనిపై పలువురు మండిపడుతున్నారు.
పెరిగిన పనివేళలు
ప్రస్తుతం పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. అయితే కొత్త టైమ్ టేబుల్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపికై న పాఠశాలలు పనిచేయాల్సిఉంది. ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ సమయం 5 నిమిషాలు చొప్పున, భోజన విరామ సమయాన్ని 15 నిమిషాలు ఉంటుంది. ఉదయం మొదటి పీరియడ్‌ను 50 నిమిషాలకు పెంచారు. ఆ తరువాత 3 పీరియడ్లను 40 నుంచి 45 నిమిషాలు చేశారు. మధ్యాహ్నం మొదటి పీరియడ్ సమయాన్ని మార్చకుండా తక్కిన 3 పీరియడ్లను 45 నిమిషాలకు పెంచారు. ఈ మార్పుతో పాఠశాల సమయం గంట పెరగనుంది. ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కొత్త టైంటేబుల్ ఇలా..
ఫస్ట్ బెల్ ఉదయం 9 గంటలకు, సెకండ్ బెల్ 9.05, స్కూల్ అసెంబ్లీ 9.05 నుంచి 9.25, మొదటి పీరియడ్ 9.25 నుంచి 10.15, రెండో పీరియడ్ 10.15 నుంచి 11.00, బ్రేక్ 11.00 నుంచి 11.15, మూడో పీరియడ్ 11.15 నుంచి 12, నాల్గో పీరియడ్ 12 .00 నుంచి 12.45, లంచ్ బ్రేక్ 12.45 నుంచి 1.45, ఐదో పీరియడ్ 1.45 నుంచి 2.30, ఆరో పీరియడ్ 2.30 నుంచి 3.15, బ్రేక్ 3.15 నుంచి 3.30, ఏడో పీరియడ్ సాయంత్రం 3.30 నుంచి 4.15, ఎనిమిదో పీరియడ్ 4.15 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment