అటవీ భూములు హాంఫట్‌! | - | Sakshi
Sakshi News home page

అటవీ భూములు హాంఫట్‌!

Published Sat, Sep 28 2024 11:22 AM | Last Updated on Sat, Sep 28 2024 11:22 AM

అటవీ

మైల్వార్‌ రిజర్వ్‌ ఫారెస్టు సరిహద్దులో కబ్జాల పర్వం

326 ఎకరాల్లో కన్నడ రైతుల అక్రమ సాగు

411 ఎకరాల్లో తెలంగాణ రైతుల పాగా

బషీరాబాద్‌: అంతర్రాష్ట్ర సరిహద్దులోని మైల్వార్‌ రిజర్వ్‌ ఫారెస్టు భూములు రోజురోజుకూ అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు సుమారు 5 వేల ఎకరాల్లో దట్టంగా విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం ప్రస్తుతం మూడు వేల ఎకరాలకు కుంచించుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన రైతులు, స్థానికులు సుమారు 737 ఎకరాల ఫారెస్ట్‌ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నట్లు సర్వేలో బయటపడింది.

అధికారుల సర్వే

జిల్లా సరిహద్దులోని బషీరాబాద్‌ మండలం కర్ణా టకకు సరిహద్దుగా ఉంది. మండలంలోని మైల్వార్‌ రిజర్వు ఫారెస్టు కింద ఉన్న అటవీ భూముల్లో పరిసర గ్రామాల, తండాల రైతులు చెట్లను నరికి యథేచ్ఛగా భూములు సాగుచేస్తున్నారు. మండలంలోని జలాల్‌పూర్‌, నీళ్లపల్లి, ఇస్మాయిల్‌పూర్‌, మైల్వార్‌ గ్రామాల పరిధిలోని సర్వేనంబర్‌ 69, 35, 20, 218, 235లలోని మొత్తం 737 ఎకరాలను ఆక్రమించినట్లు వారం రోజులుగా రెవెన్యూ అధికారులు నిర్వహించిన క్రెడెస్టల్‌ మ్యాప్‌ సర్వేలో వెల్లడైంది. ఇందులో తెలంగాణ రైతులు 411 ఎకరాలు సాగు చేస్తుండగా, కర్ణాటకలోని పలుగు కుచ్చతండా, కరోబార్‌తండా, గోప్యానాయక్‌తండా, బొందంపల్లితండా, ఇందిరానగర్‌, బీమ్లాతండా, హజార్‌తండా, బోయిన్‌పల్లి తండాకు చెందిన సుమారు వంద మంది రైతులు మిగిలిన భూములను ఆక్రమించినట్లు తేలింది. అయితే గతంలో ప్రభుత్వాలు అసైన్డ్‌ కింద అటవీ భూముల పంపిణీ ద్వారా 1,190 ఎకరాలను రైతులకు పట్టాలు ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు నివేదికలో తెలిపారు.

కుదరని లెక్కలు

మైల్వార్‌ రిజర్వు ఫారెస్టులో 5 వేల ఎకరాలకు గాను 1,053 ఎకరాలు ఫారెస్టు భూములు ఉన్నట్లు రెవెన్యూ నివేదికలో తెలిపారు. కానీ కబ్జాకు గురైన 737 ఎకరాలు, పంపిణీ చేసిన 1,190 ఎకరాలు కలిపితే 1,927 ఎకరాలు అవుతుంది. ఈ లెక్కన 2020 ఎకరాల భూములు ఏమైనట్లో అంతు చిక్కడం లేదు. దీనిపై రెండు రాష్ట్రాల అధికారులు ఉమ్మడి సర్వే చేస్తే తప్ప భూముల లెక్కలు తేలవని రైతులు అభిప్రాయ పడుతున్నారు.

17 మందిపై కేసు

ఇటీవల మైల్వార్‌ అటవీ భూముల్లో చెట్లు నరుకుతున్న సమాచారం వచ్చింది. అక్కడ వెళ్లి చూడగా మైల్వార్‌ తండాకు చెందిన 17 మంది భూములు సాగు చేయడానికి చెట్లు నరికివేసినట్లు గుర్తించాం. వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం. ఎవరైనా అటవీ భూముల్లో చెట్లు నరికిన, కబ్జాకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. – స్నేహశ్రీ, ఫారెస్టు సెక్షన్‌ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
అటవీ భూములు హాంఫట్‌! 1
1/1

అటవీ భూములు హాంఫట్‌!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement