ధాన్యం సేకరణకు సన్నద్ధం
వికారాబాద్: వానాకాలం సీజన్(2024–25)కు సంబంధించి పంట చేతికొస్తుండటంతో అధికారులు ధాన్యం సేకరించేందేకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. గడిచిన రెండు రోజుల్లో 15 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా ఈ వారంలో మరో 111 సెంటర్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి పంట సాగయ్యింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది 100 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించగా ఈ సారి అదనంగా మరో 26 కేంద్రాలను పెంచారు. సన్న రకం వడ్ల కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
మద్దతు ధర రూ.2,320
కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే మొత్తంతో తాము కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. క్వింటాలు ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బీ గ్రేడ్‌కు రూ.2,300 చెల్లించాలని నిర్ణయించారు. ఎకరాకు సగటున 22 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ లెక్కన 2.8లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు. అయితే 1,05,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. శనివారం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ధాన్యం సేకరణపై సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మూడు ఏజెన్సీలకు బాధ్యతలు
జిల్లా వ్యాప్తంగా మూడు ఏజెన్సీల ద్వారా ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. ఐకేపీ ఆధ్యర్యంలో 34 కేంద్రాలు, డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో 31, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 61 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సేకరించిన ధాన్యాన్ని 70 మిల్లులకు తరలించి మిల్లింగ్ ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. వడ్లు నిల్వ చేసేందుకు ఇప్పటికే స్థలాలు, మిల్లులను గుర్తించారు.
సన్నరకానికి ప్రత్యేక కేంద్రాలు
క్వింటాలు సన్నరకం వడ్లకు రూ. 500ల బోనస్ ఇవ్వనుండటంతో అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 18 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో 30 వేల ఎకరాల్లో సన్నరకం వరి పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సన్నరకం వడ్లు ఎక్కువగా సాగవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment