ప్రైవేటు ప్రయాణమే దిక్కు!
చేవెళ్ల: సంక్రాంతి పండుగ వేళ సొంతూర్లకు వెళ్లేందుకు జనాలు నానా అగచాట్లు పడుతున్నారు. సరిపడా బస్సులు లేక ప్రయాణ ప్రాంగణాల్లో పడిగాపులు కాస్తున్నారు. వరుస సెలవులతో వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు, మరోపక్క వలసజీవులు గ్రామాల బాట పట్టారు. దీనికి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శనివారం చేవెళ్ల బస్‌స్టేషన్ ఉదయం నుంచి రాత్రి వరకు జనంతో కిక్కిరిసిపోయింది. గంటల తరబడి నిరీక్షించినా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బస్సులను వేస్తున్నట్లు ప్రకటించినా.. ఎక్కడా అలాంటి ఏర్పాట్లు లేవని ప్రయాణికులు మండిపడ్డారు. చేవెళ్ల పరిసరాల్లో ఎక్కువగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు ఉండడంతో పండుగ సెలవులకు ఊళ్లకు వెళ్లేందుకు బయలు దేరారు. దీంతో పాటు వలస కూలీలు, ఇతర పనుల కోసం వచ్చిన వారు గ్రామాలకు వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు కావటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.
సమయానికి రాని బస్సులు
చేవెళ్ల బస్‌స్టేషన్‌లో విద్యార్థులు, వారిని తీసుకువెళ్లేందుకు వచ్చిన కుటుంబ సభ్యులతో సందడి మారింది. దీనికి తోడు రెగ్యూలర్‌గా వచ్చే బస్సులు కూడా సమాయానికి రాకపోవటంతోపాటు, వచ్చిన కొన్నింటిలోనే సీట్లు ఖాళీ లేవు. ప్రతి బస్సులో కూర్చోవటం కాదు, కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. ప్రభుత్వం కూడా ప్రైవేటు వ్యాపారం లాగానే పండుగకు ప్రత్యేక బస్సుల పేరుతో రెగ్యూలర్‌గా వచ్చే వాటికే స్టిక్కర్లు వేసి అధిక చార్జీలు వసూళ్లు చేశారని ప్రయాణికులు వాపోయారు. చిన్నపిల్ల లు, వృద్ధులు, మహిళలు బస్సులు ఎక్కేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. కొంతమంది ప్రైవేటు వా హనాల్లో ప్రయాణం చేసి అధిక చార్జీలతో జేబులు ఖాళీ చేసుకున్నారు. ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సొంతూర్లకు వెళ్లేందుకు బస్సులు లేక అవస్థలు
చేవెళ్ల బస్‌స్టేషన్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు
గంటల తరబడి నిరీక్షణ
Comments
Please login to add a commentAdd a comment