రైతు భరోసాకు కసరత్తు
● విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం
● జిల్లాలో భూ విస్తీర్ణం 12.35 లక్షల ఎకరాలు
● సగటున సాగుభూమి 5.5 లక్షలు ఎకరాలు
● గతంలో ఒక్కో పంటకు ఇచ్చిన రైతుబంధు రూ.310 కోట్లు
● సాగు యోగ్యత భరోసాతో.. సగానికి తగ్గే అవకాశం
వికారాబాద్: ప్రభుత్వం రైతుభరోసా ఇచ్చేందుకు సూచనాప్రాయంగా విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం, మంత్రులు పాలనాధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు, అధికారులు కసరత్తు షురూ చేశారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు రైతుభరోసాకు కావాల్సిన ప్రాథమిక సమాచారం సిద్ధం చేసి పెట్టుకోగా.. ప్రస్తుత విధివిధానాలపై ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
రూ.330 కోట్ల వరకు..
జిల్లా పరిధి ఇరవై మండలాల్లో 12.35 లక్షల వ్యవసాయ భూమి ఉండగా, 2,68,107 మంది రైతులు ఉన్నారు. ఇందులో ఏటా ఖరీఫ్‌లో సగటున 5.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. గతంలో పండించిన భూములతో పాటు.. సాగు చేయని భూములు, నాలా కన్వర్షన్, వ్యవసాయ యోగ్యం కాని భూములు, ప్లాట్లుగా మారిన భూములకు సైతం రైతుబంధు రైతు ఖాతాల్లో జమ అయింది. దీంతో ఏటా ప్రతి పంట, ఎకరాకు రూ.5వేల చొప్పున సగటున 6 నుంచి 6.5 లక్షల ఎకరాల భూమికి రూ.300 కోట్ల నుంచి 320 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా పేరుతో ఎకరానికి రూ.6వేల చొప్పున రెండు పంటలకు రూ.12 వేలు జమ చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంటలు సాగవుతున్న 5.5 లక్షల ఎకరాల భూమికి మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి వస్తే ప్రతి పంటకు రూ.330 కోట్ల వరకు జమ చేయాల్సి ఉంటుంది.
అధికారుల తర్జనభర్జన
రైతుభరోసా ఎవరికి ఇవ్వాలనే విషయంలో విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో రైతుభరోసాకు లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని స్పష్టతనిచ్చినట్లయింది. గతంలో సాగుతో సంబంధం లేకుండా అన్ని రకాల భూమికి రైతుబంధు అందించారు. ఇప్పుడు సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే సాయం ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో కోత విధించనున్నారనేది స్పష్టతమవుతోంది. ఎవరికి కోత పెట్టాలి? సర్వే ఎలా చేయాలి? లబ్ధిదారులను ఎలా గుర్తించాలి?, గుర్తిస్తే ప్రధానంగా పెద్ద రైతులు, సాగు చేయకుండా వదిలేసిన వారి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
నాడు రూ.10వేలు.. నేడు రూ.12వేలు
బీఆర్‌ఎస్ హయాంలో.. రైతుబంధు పేరిట ప్రతి పంటకు, ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదిలో రెండు పంటకు కలిపి రూ.10 వేలను రైతుల ఖాతాలో జమ అయ్యేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం.. రైతుభరోసా పేరుతో అదే పథకాన్ని అమలు చేయనుంది. ఏడాదికి రూ.6 వేల చొప్పున, ఏడాదికి రూ.12 వేలు రైతుల ఖాతాల్లో వేయనుంది. గత ప్రభుత్వం.. జిల్లాలో ఉన్న మొత్తం భూమికి సాగుసాయం ఇవ్వగా.. ప్రస్తుత ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే భరోసా ఇస్తామని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన సాయం భారం తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment