చట్టబద్ధమైన దత్తతే ఆనందమయం
రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి
బీచ్‌రోడ్డు: పిల్లలను విక్రయించినా, కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని.. పిల్లలు కావాల్సిన వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో గురువారం ఫోస్టర్ అడాప్షన్ పేరిట అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చట్టబద్ధం కాని దత్తత, పిల్లల విక్రయాలను నివారించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 27 శిశు గృహాల్లో 108 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. గడిచిన కొంత కాలంలో 473 మంది పిల్లలను స్వదేశీ దత్తతకు, 114 మంది పిల్లలు విదేశీ దత్తతకు ఇచ్చినట్లు వెల్లడించారు. విదేశాలకు తీసుకెళ్లిన పిల్లలను కార్మికులుగా మార్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ 6 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎదగడానికి ఫోస్టర్ అడాప్షన్ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నా రు. తప్పిపోయిన పిల్లల గురించి 1098 చైల్డ్ హెల్ప్‌లైన్లకు గానీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ అంశాలపై ప్రతీ అంగన్‌వాడీ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 159 పిల్లలను దత్తత ఇచ్చినట్లు చెప్పారు. ఏపీఎస్పీటీసీఆర్ చైర్మన్ అప్పారావు, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌జేడీ చిన్మయిదేవి, జేడీ విజయ, పీడీ జి.జయాదేవి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ రాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment