డాబాగార్డెన్స్: జీవీఎంసీలో కారుణ్య నియామకాలపై పలు అనుమానాలున్నాయని, ఇక నుంచి దీనికి సంబంధించిన ఏ ఫైల్ ఉన్నా.. తమ దృష్టికి తీసుకు రావాలని స్థాయీ సంఘం సభ్యులు మేయర్, స్థాయీ సంఘం చైర్‌పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి ద్వారా అధికారులకు సూచించారు. ఆమె అధ్యక్షతన శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కారుణ్య నియామకాల ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధిన అంశం సభ్యుల చర్చకు వచ్చింది. గత నెలలో 35 మందికి సంబంధించి ఫైల్ చేశామని, 30 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రొసీడింగ్స్ పొందిన 30 మందికి అటెండర్ ఉద్యోగాలు ఇచ్చామని తెలపగా సభ్యులు స్పందించారు. వీరిలో చాలా మంది డిగ్రీ అర్హత ఉన్నప్పటికీ.. ఇద్దరి(మచ్చ గోవింద, అరకు ఉదయ్‌కిరణ్)కే జూనియర్ అసిస్టెంట్లుగా ఎందుకు నియమించారని ప్రశ్నించారు. కారుణ్య నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, అసలు ఉద్యోగుల వారసులేనా? లేదా అని సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని వాయిదా వేశారు. రెవెన్యూ అంశాలను స్థాయీ సంఘం దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో 71 అంశాలు, 2 టేబుల్ అజెండాలు పొందుపరచగా.. 4 అంశాలను వాయిదా వేశారు. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, జోన్–4 జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడు, ఏవో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment