రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ దిశగా అడుగులు
● ఐదేళ్లలో మేక్ ఇన్ ఇండియా పేరుతో అందుబాటులోకి తీసుకొస్తాం ● కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
సాక్షి, విశాఖపట్నం: యుద్ధ విమానాల తయారీలో రాణిస్తున్న భారత్.. త్వరలోనే రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారు చేసే దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ ముగింపు సదస్సులో ఆయన ప్రసంగించారు. వచ్చే ఐదేళ్లలో మేక్ ఇన్ ఇండియా పేరుతో పౌర విమానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కేవలం ప్రయాణికుల సౌకర్యాలకే కాకుండా.. విమానాల తయారీలోనూ భారత్ తన సత్తా చాటే రోజులు సమీపంలోనే ఉన్నాయన్నారు. ఒక్క సంస్థ విమానాల తయారీకి ముందుకొచ్చినా.. ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రంలో డీప్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటిలి జెన్స్‌ని ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. విశాఖకు బహుళజాతి సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడితే.. హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తరఫున డ్రోన్ టెక్నాలజీ, ఏవియేషన్‌కు ప్రాధాన్యమిస్తున్న ఏపీకి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు. డీప్‌టెక్ నైపుణ్య ఫౌండేషన్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు, మెడ్‌టెక్‌జోన్ సీఈవో జితేంద్రశర్మ, ఎస్‌టీపీఐ వైజాగ్ చాప్టర్ ప్రతినిధి సురేష్ బాత్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment