స్వర్ణకవచాలంకరణలో కనకమహాలక్ష్మి
చీపురుపల్లి: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు గురువారం స్వర్ణకవచాలంకృత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆలయ ఈఓ బి.శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పిలి గోవింద, వైస్ చైర్మన్ సూరు కుమార్‌ల నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కలశ స్థాపన చేసి సామూహిక కుంకుమార్చనలు, చండీహోమం నిర్వహించారు.
మల్బరీ సాగుకు రాయితీలు
● జిల్లా పట్టు పరిశ్రమ శాఖాధికారి సాల్మన్ రాజు
నెల్లిమర్ల రూరల్: మల్బరీ సాగుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రైతులు అందిపుచ్చుకోవాలని జిల్లా పట్టు పరిశ్రమ శాఖాధికారి సాల్మన్‌రాజు సూచించారు. మండలంలోని ఒమ్మి, జోగిరాజుపేట గ్రామాల్లో గురువారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టుపురుగుల పెంపకం లాభదాయకమన్నారు. ఏఓ పూర్ణిమ మాట్లాడుతూ పంటల్లో పురుగు మందులు, ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి నవీన్, గ్రామ పెద్ద మత్స శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీ టెట్ తొలిరోజు
పరీక్ష ప్రశాంతం
విజయనగరం అర్బన్: జిల్లాలో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. తొలిరోజు పేపర్–2 (ఏ ) తెలుగు లాంగ్వేజ్ పరీక్షను జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఉదయం, మూడు పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షలో 850 మందికి 775 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 760 మందికి 691 మంది హాజరైనట్టు డీఈఓ ఎం. ప్రేమకుమార్ తెలిపారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు సుబ్బారెడ్డి, ఆర్డీఓ ఎస్.డి.అనిత పరీక్ష కేంద్రాలను సందర్శించారు.
పైడితల్లి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
విజయనగరం అర్బన్: దసరా, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్
సర్వీసులు నడుపుతామని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం, ఎస్.కోట డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 4 నుంచి 16వ తేదీ వరకు విశాఖపట్నం–విజయనగరం, విజయనగరం నుంచి బొబ్బిలి, పార్వతీపురం చీపురుపల్లి, అనకాపల్లి తదితర నగరాలకు ప్రతిరోజూ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు. ఈ నెల 10, 11వ తేదీల్లో హైదరాబాద్ నుంచి విజయనగరానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. apsrtconline.in అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. పూర్తి వివరాలకు సెల్: 99592 25620 (విజయనగరం డిపో మేనేజర్), 94943 31213 (అసిస్టెంట్ మేనేజర్), 73829 21380 (సూపరింటెండెంట్ ), 73829 23683 (బుకింగ్ సూపర్‌వైజర్), 94403 59596 (సిస్టం సూపర్‌వైజర్) నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment