రేషన్ పప్పు తుస్
రాజాం: కందిపప్పు ధర మండిపోతుంది. బయట మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.170 నుంచి రూ.180లు వరకు ఉంది. గత ప్రభుత్వం రేషన్ సరుకులతో పాటు కందిపప్పు, గోధుమపిండి, రాగి పిండి అందజేసేది. కిలో కందిపప్పు రూ.50 లు నుంచి రూ.60లకు అందించేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ సరుకుల సరఫరాకు బ్రేక్ పడింది. గత మూడు నెలలుగా కేవలం రేషన్ బియ్యం మినహా ఇతర సరుకులు ఏవీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం కందిపప్పు ధర మార్కెట్‌లో అమాంతంగా పెరిగిన నేపథ్యంలో సామాన్య ప్రజలు కొనుకునితినలేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో రేషన్ సరుకులు ద్వారా ఈ నెల కందిపప్పు వస్తుందని అనుకున్నారు. ప్రభుత్వం కందిపప్పు సరఫరా అరకొరగా చేయడంతో అటు డీలర్లు, ఇటు సివిల్ సప్‌లై అధికారులు ఏమిచేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు.
నియోజకవర్గానికి కేవలం 10 టన్నులు మాత్రమే
జిల్లా వ్యాప్తంగా 6,61,547 రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కో కార్డుకు ఒక కిలో కందిపప్పు చొప్పున ఇచ్చినా జిల్లా మొత్తం 6.61 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం ఒక్కో నియోజకవర్గానికి కేవలం 10 టన్నులు కందిపప్పు మాత్రమే పంపిణీ చేసింది. జిల్లా మొత్తంపై 70 టన్నుల మేర మాత్రమే కందిపప్పు వచ్చింది. ఈ సరుకులు కేవలం 70 వేల మంది కార్డు లబ్ధిదారులకు మాత్రమే సరిపోతున్నాయి. మిగిలినవారికి మొండిచెయ్యే కనిపిస్తోంది. దీంతో గ్రామాల్లో వివాదాలు వచ్చే ప్రమాదం ఉందని గమనించిన రేషన్ డీలర్లు అరకొర కందిపప్పును తీసుకెళ్లలేక మిన్నకుండిపోయారు. బయట కిలో కందిపప్పు రూ.170 దాటి పలుకుతుండగా, రేషన్ ద్వారా రూ.70కే పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కందిపప్పు వ్యవహారం తేలకపోవడంతో రేషన్ బియ్యం పంపిణీ కూడా ఇంతవరకూ జరగలేదు. గత ప్రభుత్వం హయాంలో ప్రతినెలా 1వ తేదీన రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభం అయ్యేది. 5వ తేదీలోగా సరుకుల పంపిణీ పూర్తిచేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం బీపీఎల్ కార్డులకు అందించే రేషన్ బియ్యం, సరుకులు సకాలంలో అందించలేక చేతులెత్తేయడంతో గ్రామాల్లో విమర్శలు ప్రారంభమయ్యాయి.
5 టన్నులు మాత్రమే వచ్చింది..
రాజాం సివిల్ సప్‌లై గోదాం పరిధిలో రాజాం, సంతకవిటి మండలాలు ఉన్నాయి. ఈ రెండు మండలాలకు కేవలం 5 టన్నులు మాత్రమే కందిపప్పు వచ్చింది. రాజాం పట్టణంలో రేషన్ డిపోలకు ప్రస్తుతం పంపిణీకి కందిపప్పు ఇస్తున్నాం. మిగిలినది వచ్చిన తరువాత గ్రామాల్లో పంపిణీచేస్తాం.
– వై.మధు, సివిల్ సప్‌లై ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి, రాజాం
లబ్ధిదారులకు అందని రేషన్ కందిపప్పు
ఈనెల కూడా అరకొరే
కందిపప్పు కొరతతో నిలిచిన రేషన్ బియ్యం పంపిణీ
ఒక్కో నియోజకవర్గానికి 10 టన్నుల మాత్రమే సరఫరా
చేసేదిలేక తలలు పట్టుకున్న
సివిల్ సప్‌లై అధికారులు
Comments
Please login to add a commentAdd a comment