జోరందుకున్న నిర్మాణ పనులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
రాష్ట్ర పునర్విభజన చట్టం–2014 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో వరుస పరిణామాలను గమనిస్తే... ఎవరు అభివృద్ధి కారకులో, ఎవరు అభివృద్ధి కంటకులో సామాన్యులకు సైతం అర్థమవుతుంది. ఈ కేంద్రీయ విద్యాసంస్థకు భూమి కేటాయింపు విషయంలో గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభీష్టానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపించింది. కొత్తవలస పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసిన లేఅవుట్లకు ఊతమిచ్చేలా రెల్లి గ్రామానికే తిరిగి తీసుకెళ్లడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు వృథా ప్రయాసే అయ్యాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఎస్టీ రిజర్వుడ్ సాలూరు నియోజకవర్గంలోనే విశాలమైన క్యాంపస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
దాదాపు రూ.31.91 కోట్లతో భూసేకరణ ప్రక్రియ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయ్యింది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి ఆ భూమిని యూనివర్సిటీ పాలకవర్గానికి స్వాధీనం చేసింది. ఇది అన్నివిధాలా అనువైందని గత ఏడాదే ఇక్కడ పర్యటించిన కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తంచేసింది. కేంద్ర ప్రజాపనుల విభాగం ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణ పనులు జోరందుకున్నాయి.
రెల్లి భూములపై మరో ఆలోచన...
కొత్తవలస మండలం రెల్లి వద్ద కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములను కేంద్ర ప్రభుత్వానికే చెందిన గ్రేహౌండ్స్ విభాగానికి అప్పగించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఒకసారి ఆ భూములను పరిశీలించారు. అధికారికంగా స్వాధీనం చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment