ఎరువుపై ధరల బాదుడు!
నేడు: టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్ సీజన్‌లోనే కాదు సీజన్ ముగింపునకు వచ్చినా రైతులకు ఎరువుల కోసం కష్టాలు తప్పట్లేదు. ఆర్‌బీకే పేరును ఆర్‌ఎస్‌కే అని మార్చడంపై పెట్టిన శ్రద్ధ... రైతులకు మెరుగైన సేవలు అందించడంలో కనిపించలేదు. ఆర్‌ఎస్‌కేల్లో ఎరువులే కనిపించట్లేదు. రైతులకు మళ్లీ గత టీడీపీ పరిపాలనలో మాదిరిగానే ప్రైవేట్ ఎరువుల దుకాణాలదే హవా. ఎమ్మార్పీ గాకుండా వ్యాపారులు చెప్పిన ధరకే కొనుక్కోవాలి. లేదంటే వెనక్కి తిరిగిపోవాల్సిందే. పంటలను కాపాడుకోవడానికి వేరే గత్యంతరం లేక వారు ఎంత బాదినా భరిస్తున్నారు.
నాడు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) రైతులకు సౌకర్యంగా ఉండేవి. ఎరువు ఏది కావాలన్నా గ్రామాల్లోనే దొరికేది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అదీ ప్రభుత్వం నిర్దేశించిన ధరకే లభించేది. ఎమ్మార్పీ కన్నా ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రైవేట్ దుకాణాల దోపిడీకి అడ్డుకట్ట ఉండేది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఖరీఫ్ సీజన్ ముగింపునకు వచ్చింది. వరి పంట దాదాపుగా చాలా ప్రాంతాల్లో రైతుల చేతికి వచ్చింది. ఇక చెరకు, మొక్కజొన్న, పత్తి, గోగు, కూరగాయలతో పాటు ఉద్యాన పంటలు విజయనగరం జిల్లాలో దాదాపు 16,613 హెక్టార్లలో, పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు పది వేల హెక్టార్లలో సాగవుతున్నాయి. ఇప్పుడు డీఏపీ, యూరియా అవసరం. వాటి కోసం రైతులు రైతు భరోసా కేంద్రాల (రైతు సేవా కేంద్రాల)కు వెళ్తే తెల్లముఖం వేయాల్సి వస్తోంది. ప్రైవేట్ ఎరువుల వ్యాపారుల దగ్గర మాత్రం పుష్కలంగా నిల్వలు ఉంటున్నాయి. కొనాలంటే బాదుడు తప్పట్లేదు. రెండు జిల్లాల్లో ప్రైవేట్ ఎరువుల దుకాణాలు దాదాపు 300 వరకు ఉన్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచీ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. డీఏపీ బస్తా ఖరీదు రూ.1350 అయితే, దానికి అదనంగా గుళికల కోసం మరో రూ.500 చొప్పున ఇటీవల వరకూ రైతుల జేబుకు చిల్లుపెట్టేవారు. ఇప్పుడు రూ.1400 నుంచి రూ.1800 వరకూ వసూలు చేస్తున్నారు. ఒక్కో యూరియా బస్తా ఎమ్మార్పీ రూ. 270 అయితే అదనంగా రైతులు చెల్లించాల్సి వస్తోంది. డిమాండ్‌ను బట్టి రూ.300 నుంచి రూ.340 వరకూ కొందరు వ్యాపారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. పొటాష్, ఇతర కాంప్లెక్స్ ఎరువులపైనా రూ.50 వరకూ అదనంగా బాదేస్తున్నారు. అసలే పెట్టుబడి పెరిగిపోయి మరోవైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక ఇబ్బంది పడుతున్న రైతులకు ఎరువు కష్టాలు తప్పట్లేదు.
దోపిడీ సాగుతోందిలా...
ఖరీఫ్ ముగింపునకు వచ్చినా రైతును వీడని ఎరువు కష్టాలు
మొక్కజొన్న, కూరగాయల సాగులో అదనపు భారం
యూరియా, డీఏపీ ఎరువులపై
ఎమ్మార్పీ కన్నా ఎక్కువ వసూలు
రాజాం నియోజకవర్గంలో రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు పూర్తిగా కనుమరుగయ్యాయి. గతంలో ఈ కేంద్రాల్లో కియోస్కో యంత్రాలు ద్వారా రైతులు ముందుగా నమోదు చేసుకుంటే చెంతనే సకాలంలో పొందేవారు. ప్రస్తుతం ఈ సేవలు ఆగిపోయాయి. రాజాం పట్టణంలో ఎరువుల దుకాణాల వ్యాపారులు సిండికేట్ అయ్యారు. పురుగుమందులు, ఎరువులు ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారన్నది రైతుల మాట. పాలకులు, అధికారులు ఎవరూ రైతుల కష్టాలను పట్టించుకోవట్లేదు. గతంలో పాలకొండ రోడ్డులోని ఓ ఎరువుల దుకాణం నిర్వాహకులకు ఉన్నతాధికారుల నుంచి నోటీసులు జారీ అయినా స్థానిక వ్యవసాయశాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
విజయనగరం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే రూరల్ మండలంలోని ఎరువుల దుకాణాలు ఉన్నాయి. 14 ఆర్‌ఎస్‌కేలు ఉన్నా మూడు చోట్ల మాత్రమే అదీ అరకొరగా స్టాక్ ఉంది. కియోస్కో యంత్రాలను పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎరువుల దుకాణాల వ్యాపారులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నన్నట్టు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా మార్పు కనిపించట్లేదు. కనీసం దుకాణాల వద్ద నోటీసు బోర్డులో ఎరువుల స్టాక్, ధరల వివరాలు ఎక్కడా కనిపించట్లేదు.
బొబ్బిలి నియోజకవర్గంలో యూరియా రూ.267 బస్తాను రూ.320 నుంచి రూ.340 వరకూ విక్రయిస్తున్నారు. డీఏపీ బస్తా ఎమ్మార్పీ రూ.1350 కాగా రూ.50 అదనంగా బాదేస్తున్నారు. పొటాష్, ఇతర కాంప్లెక్స్ ఎరువులు కూడా బస్తా వద్ద రూ.30 నుంచి రూ.60 అదనంగా వసూలు చేస్తున్నారు.
కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లోని రైతు సేవా కేంద్రాలో ఎరువులు అందుబాటులో లేవు. ప్రస్తుతం పంటలకు అవసరమైన డీఏపీ కోసం రైతులు దుకాణాలపైనే ఆధారపడుతున్నారు. ఒక్కో బస్తా రూ.1500 నుంచి రూ.1600 వరకు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
పాలకొండ నియోజకవర్గంలో కూరగాయల సాగు చేస్తున్న రైతులు ముఖ్యంగా వీరఘట్టం, భామిని మండలాల్లో యూరియా బస్తాపై రూ.100 వరకూ అదనంగా చెల్లించి ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment