మూడు కిలోల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని మూడుకిలోల గంజాయిని వన్‌టౌన్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలో వన్‌టౌన్ ఎస్‌ఐ నరేష్ తన సిబ్బందితో నిఘా పెట్టారు. తమిళనాడు రాష్ట్రం తిరువేలూరు జిల్లా అంబత్తూర్‌కి చెందిన ఎస్.శ్రీను గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. బరంపురం రైల్వేస్టేషన్ వద్ద గాయత్రీ అనే మహిళ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్టు తెలిపాడన్నారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ నరేష్, తదితరులు పాల్గొన్నారు.
హరిత ప్రాంగణంగా
జేఎన్‌టీయూ జీవీ
విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీని హరిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలని సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్, ఏయూ మాజీ వీసీ డాక్టర్ బీఎస్‌ఎన్‌రాజు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం జరిగిన రీసెర్చ్ అడ్వయిజర్ కమిటీ సమావేశంలో భాగంగా ఆయన యూనివర్సి టీని సందర్శించారు. వర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నారు. తొలుత గ్రీన్ క్లబ్ నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థి ఉన్నతిలో గురువుపాత్ర కీలకం
● ఆర్‌జేడీ కె.విజయభాస్కర్
గజపతినగరం: విద్యార్థుల ఉన్నతిలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర కీలకమని ఆర్‌జేడీ కె.విజయభాస్కర్ అన్నారు. గజపతినగరం మండలం మరుపల్లి పాలిటెక్నికల్ కళాశాలలో శనివారం జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లాల పరిధిలోని పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈఓల శిక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంపొందేలా బోధన సాగించాలన్నారు. నవ సమాజ నిర్మాణానికి బాటలు వేయాలన్నారు. ముందుగా మరుపల్లి మోడల్ స్కూల్‌ను సందర్శించి ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. కార్యక్రమంలో డీఈఓ మాణిక్యం నాయుడు, ఎంఈఓలు విమలమ్మ, సాయిచక్రధర్ పాల్గొన్నారు.
దళారులకు పత్తిని విక్రయించొద్దు
రాజాం: పత్తి రైతులు దళారులకు పంటను విక్రయించి నష్టపోవద్దని జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ బి.రవికిరణ్ సూచించారు. పత్తి పంట విక్రయానికి కొనుగోలు కేంద్రాలు లేవన్న అంశంపై ‘పత్తి రైతుకు దళారులే దిక్కు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో శనివారం ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. మార్కెట్ యార్డుల వద్ద ప్రారంభించే కొనుగోలు కేంద్రాల సమాచారం సేకరించామని, రైతులకు మద్దతు ధర లభించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలో కాటన్ కార్పొరేషన్ రవాణా టెండర్లు ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రామభద్రపురం మండలం ముచ్చెర్లవలసలోని పత్తికొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment