ధైర్యంగా ముందుకు సాగేవారికి విజయం సొంతం
విజయనగరం అర్బన్:
అనుకున్న రంగంలో విజయం సాధించాలంటే దృఢసంకల్పం, అంకితభావం, క్రమశిక్షణ అసరమని జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. మనలో ఈ మూడు అంశాలు ఉన్నప్పటికీ ఎన్నో అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతుంటాయని, వాటిని ధైర్యంతో ఎదిరించి నిలిచేవాడే జీవితంలో విజేతగా నిలుస్తాడని తెలిపారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆనందగజపతి ఆడిటోరియంలో ‘సామాజిక అవగాహన–జీవన నైపుణ్యాలు’ అనే అంశంపై విద్యార్థులకు శనివారం ఒక రోజు నిర్వహించిన శిక్షణ తరగతిలో ఆయన మాట్లాడారు. విజయం అంటే ఉద్యోగం సాధించడమే కాదని, జీవితంలో విజయం అనేది ఏ రూపంలో అయినా సాధించవచ్చన్నారు. లక్ష్యసాధనలో ఓర్పు, సహనంతో పాటు మనం కచ్చితంగా సాధించగలమని మనపై మనకు నమ్మకం ఉండాలన్నారు. జిల్లా అదనపు జడ్జి కె.నాగమణి మాట్లాడుతూ పిల్లలకు ముందుగా తప్పొప్పులు నేర్పించేది తల్లిదండ్రులని, పిల్లలు చిన్న వయసులో తెలియక తప్పుచేస్తే అది తప్పు అని ముందుగా మందలించేది కూడా వారేనని అన్నారు. ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తే పిల్లలు జీవితంలో ఎదుగుతారన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు కనాలి అనేవారని, ఆ కలల్లో పెద్ద కలలుగా ఐఏఎస్, ఐపీఎస్ వంటివి సాధించాలని అనుకుంటే గ్రూప్–1, 2 వంటి కలనైనా సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ శాసీ్త్రయ దృక్పథమే లక్ష్యంగా ఆవిర్భవించిన జనవిజ్ఞాన వేదిక విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పిస్తోందన్నారు. వేదిక రాష్ట్ర నాయకుడు రమేష్ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, డాక్టర్ ఎంవీఎస్ వెంకటరావు, గిరిజన యూనివర్సిటీ ఏఓ డాక్టర్ ఎన్.వి.సూర్యనారాయణ, సమతా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత, గండ్రేటి లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గండ్రేటి శ్రీనివాసరావు, పట్టణ శాఖ అధ్యక్షుడు షిణగం శివాజీ, ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment