రోడ్డున పడేసిన రక్తసంబంధం
చీపురుపల్లి: అండగా నిలవాల్సిన అన్నదమ్ములు శత్రువుల్లా మారారు.. అక్కున చేర్చుకోవాల్సిన కన్నతండ్రి కనికరించలేదు.. ఇద్దరు అన్నదమ్ములు తండ్రితో కలిసి రక్తం పంచుకుపుట్టిన మరో సోదరుడి కుటుంబంపై పగబట్టారు. అర్థరాత్రి సమయంలో ఆ కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేశారు. వారికి సంబంధించిన బట్టలు, సామగ్రి, పిల్లల పుస్తకాలను రోడ్డుపైకి విసిరేశారు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలతో సహా ఆ భార్యాభర్తలు రోడ్డున పడ్డారు. తలదాచుకునేందుకు మరో ఇల్లులేక పిల్లలతో సహా రోడ్డుపైనే కాలంగడుపుతున్నారు. గ్రామస్తులు అందజేసిన ఆహారం తింటూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా పదిహేను రోజులుగా ఎలాంటి న్యాయ సహాయం అందలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చీపురుపల్లి మండలం నిమ్మలవలస గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి బాధిత దంపతులు కోడిగుడ్ల బాలకృష్ణ, మంజుల ఆవేదన వారి మాటల్లోనే...
నిమ్మలవలస గ్రామానికి చెందిన కోడిగుడ్ల మహేష్‌కు రాజ్‌కుమార్, బాలకృష్ణ, శ్యామ్ అనే ముగ్గురు కొడుకులం. అందులో రెండో వాడిని నేను. భార్య మంజు, ఇద్దరు పిల్లలతో కలిసి చాలా కాలంగా విశాఖపట్టణంలో నివసిస్తూ ఆరు నెలల కిందటే సొంతూరు నిమ్మలవలస వచ్చాం. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా కుటుంబం అంటే తండ్రికి నచ్చదు. పెద్ద ఇల్లు ఉన్నా వంట ఇంటిని మాకు కేటాయించారు. అందులోనే భార్య, పిల్లలతో కలిసి సర్దుకుపోతున్నాం. అయినా సరే తండ్రి మద్యం మత్తులో వచ్చి నిత్యం వేధిస్తున్నారు. కుటుంబాన్ని దూషిస్తున్నారు. 15 రోజుల కిందట అర్థరాత్రి సమయంలో ఇద్దరు సోదరుల సహాయంతో తమ కుటుంబాన్ని రోడ్డుపైకి గెంటేశారు. బట్టలు, సామాన్లు విసిరేసి, పిల్లలతో సహా తమను రోడ్డుపైకి తోసేశారు. అప్పటి నుంచి రోడ్డుపైనే ఉంటూ స్థానికులు ఇచ్చే ఆహారంతో జీవనం సాగిస్తున్నాం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు వచ్చి చూసి వెళ్లారు. ఎలాంటి న్యా యం జరగలేదు. చలిలో పిల్లలతో కలిసి రోడ్డుపై జీవిస్తున్నా... న్యాయం చేయాల్సిన పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడంలేదు. తమకు న్యాయం చేయకుంటే పిల్లలతో కలిసి ఆత్మహత్యే శరణ్యమంటూ బాలకృష్ణ, మంజు దంపతులు బోరున విలపించారు.
కేసు నమోదు చేశాం..
నిమ్మలవలస గ్రామానికి చెందిన కోడిగుడ్ల మంజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మంజు, బాలకృష్ణ కుటుంబాన్ని ఇంటి నుంచి వెల్లగొట్టిన ఫిర్యాదులో కోడిగుడ్ల మహేష్, రాజ్‌కుమార్, శ్యామ్‌లపై కేసు నమోదు చేశాం.
– ఎల్.దామోదరరావు,
ఎస్‌ఐ, చీపురుపలి్ల
తండ్రితో కలిసి ఇద్దరు సోదరుల దుశ్చర్య!
మరో సోదరుడి కుటుంబాన్ని రోడ్డుపైకి గెంటివేత
దుస్తులు, సామగ్రిని బయటకు
విసిరేసిన వైనం
పిల్లలతో కలిసి గజగజ వణికిస్తున్న చలిలో 15 రోజులుగా రోడ్డుపైనే నివాసం
న్యాయం జరగకపోతే ఆత్మహత్యే
శరణ్యమంటున్న కుటుంబం
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినా న్యాయం జరగలేదంటూ ఆవేదన
కేసు నమోదు చేశాం:
ఎస్‌ఐ దామోదరరావు
Comments
Please login to add a commentAdd a comment