విభిన్న ప్రతిభావంతుల హక్కులను పరిరక్షించాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: విభిన్న ప్రతిభావంతుల హక్కులను పరిరక్షించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం–2016 అమలుపై కలెక్టరేట్ సమావేశమందిరంలో గురువారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ జగదీష్ చట్టంలో పొందుపర్చిన అంశాలను వివరించారు. రెడ్‌క్రాస్ చైర్మన్ కేఆర్‌డీ ప్రసాద్ విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రస్తావించారు. సదరం ధ్రువపత్రాల జారీతో పాటు ఆటిజంతో బాధపడుతున్న వారికి బీమా కల్పించాలని కోరారు. అంధ ఉద్యోగులకు కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులనుంచి వేధింపులు ఎదురవుతున్నాయని, వాటిని అరికట్టాలని, వారు చేయగలిగే పనులను మాత్రమే చెప్పాలని ఆ సంఘ నాయకుడు ఉమాశంకర్ కోరారు. సదరం ధ్రువపత్రాల్లో తప్పులు సరిచేయాలని, డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించాలని, అందరికీ బస్‌పాస్‌లు మంజూరు చేయాలని, అనువాదకుడిని నియమించాలని మూగ, చెవిటి అసోసియేషన్ నాయకురాలు లక్ష్మి విజ్ఞప్తిచేశారు. సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సెల్ కార్యదర్శి టి.వి.రాజేష్‌కుమార్ మాట్లాడుతూ విభి న్న ప్రతిభావంతుల పాఠశాలలకు మంచాలు, పరుపులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. వీటిపై కలెక్టర్ స్పందిస్తూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డీఈఓ యు.మాణి క్యం నాయుడు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రాణి, డీసీహెచ్‌ఎస్ రాజ్యలక్ష్మి, ఎల్‌డీఎం మూర్తి, మెప్మా పీడీ జి.వి.చిట్టిరాజు, డీఎస్‌డీఓ వెంకటేశ్వరరావు, డీఎస్పీ వీరకుమార్, పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment