గొర్రిపాటి బుచ్జి అప్పారావు పేరు తొలగించవద్దని డిమాండ్ చేస్తున్న నాయకులు (ఫైల్)
తాటిపూడి రిజర్వాయరుకు గొర్రిపాటి బుచ్చిఅప్పారావు పేరు పునరుద్ధరణ
ఫలించిన శాసనమండలి విపక్షనేత బొత్స, జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను, స్థానిక నాయకుల పోరాటం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే తాటిపూడికి గొర్రిపాటి పేరుతో నామకరణ
కూటమి ప్రభుత్వం రాగానే అక్కసుతో తొలగింపు
పునరుద్ధరించాలన్న జిల్లా ప్రజల విన్నపాలు బేఖాతరు
జిల్లా పరిషత్తు సమావేశంలో తీర్మానంతో మళ్లీ కదలిక
డీఆర్‌సీ సమావేశంలోనూ మరో తీర్మానం ఆమోదం
అన్నివైపులా ఒత్తిళ్లతో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు
‘గొర్రిపాటి బుచ్చిఅప్పారావు రిజర్వాయరు తాటిపూడి’గా నామకరణ
ప్రజాసేవలో గొర్రిపాటి...
స్వాతంత్య్ర సమరయోధుడిగా, బీసీ సామాజిక ఉద్యమవేత్తగా కీలక పాత్ర పోషించిన గొర్రిపాటి బుచ్చిఅప్పారావు (జీబీ అప్పారావు) జిల్లా తొలితరం నాయకుల్లో ఒకరు. సామాజిక, రైతు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. శృంగవరపుకోట నియోజకవర్గంలోని విజినిగిరి ఆయన స్వగ్రామం. విజయనగరంలో విద్యాభ్యాసం చేశారు. 1931 సంవత్సరంలో నాటి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. స్వాతంత్య్ర పోరాటంలో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. సత్యాగ్రహ ఉద్యమానికి స్థానికంగా నాయకత్వం వహించిన ఘనత గొర్రెపాటిది. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆచార్య ఎన్‌జీ రంగా, గౌతు లచ్చన్నలతో కలిసి భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంలోనూ ప్రధాన భూమిక వహించారు. ప్రస్తుత విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా భాగమైన అవిభక్త విశాఖ జిల్లా బోర్డు అధ్యక్షుడిగా 1951లో జీబీ అప్పారావు ఎన్నికయ్యారు. 1960లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి మరోసారి ఆ పదవిని దక్కించుకున్నారు. 1963లో శృంగవరపుకోట పంచాయతీ సమితి ప్రధమ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1967లో అప్పటి జామి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు. పార్టీలకు అతీతంగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ప్రజాసేవలో ఉన్నారు. 1989లో శాశ్వతంగా కన్నుమూశారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
జిల్లాలో సాగునీటి అవసరాలే కాదు పొరుగున మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న ప్రధానమైన జలవనరు తాటిపూడి రిజర్వాయరు. గోస్తనీ నదిపై గంట్యాడ మండలంలో తాటిపూడి వద్ద దీని నిర్మాణానికి స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు గొర్రిపాటి బుచ్చిఅప్పారావు కీలక పాత్ర పోషించారు. అందుకు గుర్తింపుగా తాటిపూడి రిజర్వాయరుకు ఆయన పేరుతో నామకరణ చేయాలని దశాబ్దాలుగా జిల్లా ప్రజలు ప్రభుత్వాలను కోరుతూనే వచ్చారు. ఎట్టకేలకు వారి ఆకాంక్ష గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెరవేరింది. ‘గొర్రిపాటి బుచ్చిఅప్పారావు తాటిపూడి రిజర్వాయరు’గా నామకరణ చేసింది. దానిపై ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరమూ లేకపోయినా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పేరును తొలగించింది. గొర్రిపాటిని అవమానించడం సహేతుకం కాదని, పేరు పునరుద్ధరించాలని ఆయన అభిమానులు ఎంత మొత్తుకున్నా టీడీపీ నాయకులు తొలుత పెద్దగా స్పందించలేదు. వినతిపత్రాలు తీసుకోవడంతోనే సరిపెట్టేవారు. ఈ నేపథ్యంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తగిన చొరవ తీసుకున్నారు. జెడ్పీ, డీఆర్‌సీ సమావేశాల్లో తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వానికి పంపించారు. దీంతో దిగొచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం... తాటిపూరి రిజర్వాయరుకు గొర్రిపాటి పేరును పునరుద్ధరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘గొర్రిపాటి బుచ్చిఅప్పారావు రిజర్వాయరు–తాటిపూడి’ అని పేరు మార్చి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
● తూచ్... తప్పే!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోని పథకాలకు, విద్యాసంస్థలకున్న పేర్లను మార్పు చేసింది. ఆ క్రమంలోనే తాటిపూడి జలాశయానికి గొర్రిపాటి బుచ్చిఅప్పారావు పేరును తొలగిస్తూ గత ఏడాది జీవో నంబరు 35ను జారీ చేసింది. జిల్లా ప్రజల అభీష్టం, ఇటు జిల్లా పరిషత్తులో, అటు డీఆర్‌సీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు ఫలించాయి. కూటమి ప్రభుత్వం తప్పు తెలుసుకొని నాలుక కరుచుకుంది. నూతన సంవత్సరంలో ఆ తప్పును సరిదిద్దుకుంది. గురువారం జలవనరుల శాఖ జీవో ఎంఎస్ నంబరు 1 విడుదల చేసింది.
తాటిపూడికి గొర్రిపాటి పేరు...
తాటిపూడి రిజర్వాయరుకు గొర్రిపాటి పేరు పెట్టాలని 2014–19 మధ్య కాలంలో నాటి చంద్రబాబు ప్రభుత్వానికి స్థానిక నాయకులు, గొర్రిపాటి అభిమానులు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. చివరకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వారి డిమాండు నెరవేరింది. అప్పట్లో మంత్రిగానున్న బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య చొరవ తీసుకున్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ‘గొర్రిపాటి బుచ్చిఅప్పారావు తాటిపూడి రిజర్వాయరు’గా కార్యరూపం దాల్చింది.
తాటిపూడి సాధకుడు జీబీ...
దాదాపు ఆరు దశాబ్దాల క్రితం గోస్తనీ నదిపై రిజర్వాయరు నిర్మించాలనే డిమాండుతో గొర్రిపాటి బుచ్చిఅప్పారావు నాయకత్వంలో ప్రజలు దీక్ష చేశారు. తీరా ప్రభుత్వం మంజూరుచేసినా ప్రాజెక్టుకు అవసరమైన మార్జిన్ మనీ కోసం అప్పటి విశాఖ మున్సిపల్ చైర్మన్‌ను ఒప్పించి కొంతమేర సాధించారు. మిగతా సొమ్ము కోసం గ్రామాల్లో జోలిపట్టి విరాళాలు తెచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల కోసం తన పదెకరాల సొంత భూమినీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment