యువకుడి హత్య
● స్నేహితుడే హంతకుడు
పూసపాటిరేగ: మండలంలోని ఎరుకొండ గ్రామంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బులు విషయమై జరిగిన వాగ్వాదమే హత్యకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎరుకొండ గ్రామానికి చెందిన గొర్లె పవన్‌కుమార్ (21), బొంతు అప్పలనాయుడు మంచి స్నేహితులు. ఇద్దరూ పెయింటింగ్ పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బుల విషయమై వివాదం చెలరేగింది. పవన్‌కుమార్‌కు అప్పలనాయుడు డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో ఇద్దరి మధ్య గొర్లె పవన్‌కుమార్ ఇంటి ఎదురుగా రహదారిపై వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో బొంతు అప్పలనాయుడు మద్యం మత్తులో స్నేహితుడు గొర్లె పవన్‌కుమార్‌పై కత్తితో పలుమార్లు విచక్షణారహితంగా ఛాతీ, కడుపులో పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కేకలు వినబడడంతో ఉలిక్కి పడిన పవన్‌కుమార్ తల్లి గొర్లె బంగారమ్మ ఇంటి బయటకు వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న కుమారుడి చేతిని తన చేతిలోకి తీసుకుని సొమ్మసిల్లి పడిపోయింది. తల్లి చేతిలో ఉండగానే పవన్‌కుమార్ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్సై ఐ. దుర్గాప్రసాద్ లు సంఘటనా స్థలానికి సిబ్బందితో పాటు చేరుకుని విచారణ చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి ఈరలించారు. ఈ మేరకు భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబానికి పెద్ద దిక్కు పోయింది
గొర్లె పవన్‌కుమార్ మృతి చెందడంతో కుటుంబం దిక్కులేనిదైంది. గతంలోనే పవనకుమార్ తండ్రి తౌడు అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వవన్‌కుమార్ కూలిపనులు చేయడంతో కుటుంబం గడిచేది. పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడని, ఒక్కగానొక్క కుమారుడిని తీసుకెళ్లిపోయావా అంటూ తల్లి, బంధువులు భోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment