రైతుబాంధవులకు... సముచిత గౌరవం
తగినన్ని గన్నీ
బ్యాగ్‌లు ఇవ్వలేదు...
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల తుపాను సమయంలో ధాన్యం రక్షణకు టార్ఫాలిన్లు ఎక్కడా ఇవ్వలేదు. మొక్కజొన్న పంట కూడా ఇటీవల వర్షాలకు దెబ్బతింది. పంట బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లించడానికి గడువు ఇవ్వాలి.
– డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్సీ
కనీస సమాచారం ఇవ్వట్లేదు...
కూటమి ప్రభుత్వంలో అటెండర్ స్థాయి ఉద్యోగి కూడా సరిగా స్పందించట్లేదు. సమావేశాలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా తనకు సమాచారం ఇవ్వట్లేదు. ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి తీరు సరికాదు.
– ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్సీ
● జలాశయాల వద్ద విగ్రహాల
ఏర్పాటుకు జెడ్పీ చైర్మన్
మజ్జి శ్రీనివాసరావు ప్రతిపాదన
● పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధికి జెడ్పీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం
● 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.497.96 కోట్ల అంచనా బడ్జెట్
● జెడ్పీ సర్వసభ్య సమావేశానికి కూటమి ప్రజాప్రతినిధులంతా డుమ్మా
● ప్రజా సమస్యలపై పలువురు సభ్యులు గళం
● సకాలంలో పరిష్కారానికి ఇరు జిల్లాల కలెక్టర్లు సానుకూల స్పందన
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం రూరల్: వెనుకబడిన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను సాధించి ఈ ప్రాంత అభివృద్ధికి బంగారు బాటవేసిన రైతుబాంధవులకు సముచిత గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. భావితరాలకు వారి సేవలు గుర్తుండేలా ఇరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులకు ఆయా మహనీయుల పేర్లతో నామకరణం చేసిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే తోటపల్లి ప్రాజెక్టుకు గౌతు లచ్చన్న, జంఝావతి ప్రాజెక్టుకు వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు, మడ్డువలస ప్రాజెక్టుకు గొర్లె శ్రీరాములునాయుడు పేర్లను పెట్టారని గుర్తుచేశారు. మళ్లీ ఆయన కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాటిపూడి జలాశయానికి గొర్రిపాటి బుచ్చిఅప్పారావు పేరుతో నామకరణం చేశారని ప్రస్తావించారు. తోటపల్లి ప్రాజెక్టు వద్ద గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటుతో పాటు పార్కును అభివృద్ధి చేసినట్లుగానే మిగతా మూడు జలాశయాల వద్ద ఆయా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని, పార్కుల అభివృద్ధి ద్వారా పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్ ప్రతిపాదించారు. ఇందుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని ఇరు జిల్లాల కలెక్టర్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎ.శ్యామ్‌ప్రసాద్ సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోతే జిల్లా పరిషత్ నిధులతోనైనా ఆ మహనీయుల విగ్రహాలను ఏర్పాటుచేస్తామని, నాలుగు జలాశయాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని జెడ్పీ చైర్మన్ స్పష్టం చేశారు. తొలుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.497.96 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన రూ.496.35 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షించారు.
చర్చించిన ప్రధాన అంశాలివే...
పీహెచ్‌సీల్లో వైద్యం అథోగతి...
గుమ్మలక్ష్మీపురంలో తాడికొండ పీహెచ్‌సీలో రోగులకు సరిగా వైద్యం అందట్లేదు. వైద్యులు రావట్లేదు. అక్కడ మందులు లేవు. ఇటీవల మా బంధువుకు ఆరోగ్యం బాగోకపోతే అక్కడకు తీసుకెళ్లాం. ఆక్సిజన్ సిలెండర్ ఉంది. కానీ అది ఖాళీ. తగిన వైద్యం అందక ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు. ప్రస్తుత కురుపాం ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ఉన్న పీహెచ్‌సీలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఇక గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో మిగతా పీహెచ్‌సీల్లోని పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
– కుంబురుక దీనమయ్య,
గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ
దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తే, ఇప్పుడు విచారణ పేరుతో వాటిని తొలగిస్తున్నారని లబ్ధిదారుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రస్తావించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పందిస్తూ పింఛన్ల తొలగింపుపై తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలేవీ రాలేదన్నారు. కేవలం వెరిఫికేషన్ మాత్రమే చేయిస్తున్నామని, ప్రత్యేక వైద్యులతో ఆరు బృందాలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అక్కడ వారి ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తారని వెల్లడించారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ కలెక్టర్‌ను కోరారు. పింఛను లబ్ధిదారులెవరైనా మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పింఛన్ అందేలా ఈ నెల నుంచి అవకాశం ఇస్తున్నారని, అంతకుముందు చనిపోయినవారి కుటుంబాలకూ దీన్ని వర్తింపజేయాలని కొంతమంది సభ్యులు ప్రస్తావించారు. దీనికి కలెక్టర్ అంబేడ్కర్ స్పందిస్తూ ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు.
మంచు పడి మామిడిపూత దెబ్బతింటోందని జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు ప్రస్తావించారు. విజయనగరం జిల్లాలో మామిడి అత్యధికంగా సాగులో ఉందని, మామిడి పండ్ల ఎగుమతి కూడా జరుగుతోందని చెప్పారు. మామిడి తోటల పంట బీమా ప్రీమియం ఎకరానికి రూ.2 వేల చొప్పున ఉందని చెప్పారు. దీంతో ఈ ప్రీమియం తగ్గించడంతో పాటు గడువు కూడా పెంచాలని తీర్మానం ప్రభుత్వానికి పంపాలని సభ్యులు కోరారు. మార్గదర్శకాలను పరిశీలించి ప్రభుత్వానికి లేఖ రాస్తానని కలెక్టరు అంబేడ్కర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జీడిమామిడి పంటకు రూ.4 వేల చొప్పున ప్రీమియం ఉందని, దీన్ని తగ్గించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులు గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా చేపడుతున్నారని, చట్టంలో నిబంధనలు బేఖాతర చేస్తున్నారని, అవినీతి చోటుచేసుకుంటోందని పలువురు సభ్యులు సభలో ప్రశ్నించారు.
ఇరుకు గదుల్లో ఎన్నాళ్లు?
ఏకలవ్య పాఠశాలను పార్వతీపురంలో ఒక అద్దె ఇంట్లో నిర్వహిస్తున్నారు. బాలలు, బాలికలు ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యకు పరిష్కారంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి చొరవ తీసుకొని కురుపాంలో కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారిపోయింది. పార్వతీపురం నుంచి ఆ కొత్త భవనాల్లోకి విద్యార్థులను తరలించడంపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. – శెట్టి పద్మావతి, కురుపాం ఎంపీపీ
‘విద్యుత్తు’ సమస్యలు పరిష్కరించండి...
తీర ప్రాంతంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తదితర గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ఉప్పుగాలి వల్ల విద్యుత్తు వైర్లు, కండక్టర్లు పాడైపోయాయి. చాలాచోట్ల విద్యుత్తు స్తంభాలు వేయలేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి.
– ఉప్పాడ అనూషారెడ్డి, భోగాపురం ఎంపీపీ
Comments
Please login to add a commentAdd a comment