మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌గా వెంకటేశ్వరరావు
విజయనగరం ఫోర్ట్: ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌గా ఎన్.వెంకటేశ్వరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉద్యానశాఖలో విధులు నిర్వహిస్తూ, డిప్యుటేషన్‌పై డీఎంగా చేరారు. ఇక్కడ జిల్లా మేనేజర్‌గా పనిచేసిన వై.విమలకుమారి పార్వతీపురం మన్యం జిల్లా కు బదిలీ అయ్యారు. ముందుగా కలెక్టర్ బి.అర్.అంబేడ్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అనుమతి తీసుకున్న తర్వాత జిల్లా మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 6,846 దరఖాస్తులు రాగా వీటిలో 4,924 దరఖాస్తులు రెవె న్యూకు సంబంధించినవే ఉన్నాయని చెప్పారు. ఈ దరఖాస్తులను పరిష్కరిస్తే జిల్లాలో రెవెన్యూ పరమైన సమస్యలన్నీ దాదాపు పరిష్కరించినట్లు అవుతుందన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములు మినహా మిగిలిన భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. రీ సర్వే కోసం ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల సరిహద్దులు, ప్రభుత్వ భూముల హద్దులను ఈ నెల 12లోగా గుర్తించాలన్నారు. ప్రీ హోల్డ్ భూముల వివరాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఫైలు ఈ ఆఫీసులో మాత్రమే పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ పైలెట్ గ్రామాల సరిహద్దులను ఖరారు చేసే విషయంలో సర్వేయర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రీ సర్వే, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే పీజీఆర్‌ఎస్, ప్రీ హోల్డ్ భూములపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు డి.కీర్తి, రామ్మోహన్, సత్య వాణి, కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ మురళీ, సర్వే ఏడీ రమణమూర్తి, తహసీల్దార్లు, సర్వేయర్లు, డీటీలు పాల్గొన్నారు.
మడ్డువలస నీరు విడుదల
వంగర: మండల పరిధిలోని మడ్డువలస గొర్లె శ్రీరాములనాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా రబీ పంటల సాగుకు అధికారులు సాగునీటిని గురువారం విడుదలచేశారు. ఏఈలు అనీల్‌కుమార్, జె.జగదీష్‌లు ప్రత్యేక పూజలు అనంతరం స్విచ్ ఆన్‌చేసి నీటిని విడిచిపెట్టారు. తొలిరోజు 150 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నామని, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల్లో ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని ఏఈలు సూచించారు.
ఏనుగుల గుంపును
తరలించండి మహా ప్రభో..!
కొమరాడ: ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు చేతికందే సమయంలో ఏనుగుల గుంపు నాశనం చేస్తున్నాయని కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మీపురం, కందివలస, కుమ్మరిగుంట, స్వామినాయుడువలస, గంగారేగువలస రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో జంఝావతి డ్యాం దాటిన ఏనుగుల గుంపు పాతకంబవలసకు చేరుకున్నాయి. అక్కడ రాజ్యలక్ష్మీపురం గ్రామానికి చెందిన బొండపల్లి నాగరాజు అనే రైతు రెండు ఎకరాల వరి చేను నూర్పిడి చేసి గోనెల్లో ఉంచిన ధాన్యంను చెల్లాచెదురుగా విసిరేశాయి. విక్రయించేందుకు సిద్ధం చేసిన ధాన్యంను ధ్వంసం చేయడంతో రైతు ఆవేదన చెందుతున్నాడు. పంటకొచ్చిన టమాటా తోటల్లో ఏనుగుల సంచారంతో పంటంతా నాశనం అవుతోందని రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment