పింఛన్ల సర్వే భయం... ఆగిన దివ్యాంగుడి గుండె
ప్రస్తుతం జిల్లాలో సాగుతున్న పింఛన్ల సర్వే లబ్ధిదారుల్లో భయంపుట్టిస్తోంది. జీవన ఆధారం కోల్పోతామన్న మనస్థాపం గుండెలను ఆగిపోయేలా చేస్తోంది. బొండపల్లి మండలం గొట్లాం పంచాయతీ పరిధిలోని జియ్యన్నవలస గ్రామానికి చెందిన
దివ్యాంగుడు చుక్క అప్పారావు పింఛన్ పోతుందన్న మనస్థాపంతోనే బుధవారం రాత్రి తనువుచాలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు 30 ఏళ్ల కిందట కాళ్లుచేతులు చచ్చుబడ్డాయి. మంచంపైనే కాలం వెళ్లదీస్తున్నాడు. దివ్యాంగుల పింఛనే ఆధారంగా జీవిస్తున్నాడు. ఇటీవల ఆయనకు మంజూరైన రూ.15వేలు పింఛన్ డబ్బులను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు స్వయంగా అందజేశారు.
ఇంతలో ఈ నెల 7న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులు పింఛన్ సర్వే నోటీసు అందజేసి ఆయన దివ్యంగత్వాన్ని పరిశీలించారు. అధికారులందరూ ఒక్కసారి ఇంటికి రావడంతో దివ్యాంగుడు అప్పారావు హడలిపోయాడు. పింఛన్ పోతుందని మనస్థాపానికి గురికావడంతో ఆయన గుండె ఆగిపోయిందంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఆయనది సహజమరణంగా పంచాయతీ కార్యదర్శి సంతోష్ ధ్రువీకరించారు.
– బొండపల్లి
Comments
Please login to add a commentAdd a comment