దేశ నిర్మాణంలో ఓటుపాత్ర కీలకం
విజయనగరం అర్బన్: దేశ నిర్మాణంలో ఓటు అత్యంత ముఖ్యమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణచక్రవర్తి అన్నారు. పాఠశాల స్థాయి నుంచే దేశం గొప్పతనం, ప్రజా స్వామ్యం గురించి పిల్లలకు బోధిస్తే... ఓటు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత సభలో అందిరితో ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి జీవనానికి స్వేచ్ఛ అవసరమని, ప్రజాస్వామ్యం నుంచే ఆ స్వేచ్ఛ లభిస్తుందని, అప్పుడే పిల్లలకు ఓటు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమని, దేశభక్తి ఉంటే ఓటు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో లెక్కలు, సైన్సుతో పాటు దేశ భక్తిని బోధించాలన్నారు. దేశాన్ని ధన తంత్రంగా కాకుండా గణతంత్రంగా ఉంచాలని హితవు పలికారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లా డుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఓటు ప్రతి ఒక్కరి కంఠధ్వనిగా పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా చేరాలని తెలిపారు. అనంతరం ఎక్కువ సార్లు ఓటింగ్‌లో పాల్గొన్న సీనియర్ సిటిజన్ విద్యాసాగర్ జైన్, దివ్యాంగ ఓటరు కొండబాబు, ట్రాన్సెండర్ ప్రణీతను ఈ సందర్భంగా సన్మానించారు. నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులను అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఉత్తమ బీఎల్‌ఓలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసరావు, ఆర్‌డీఓ కీర్తి, జిల్లా అధికారులు, యువ ఓటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
బి.సాయికళ్యాణ చక్రవర్తి
ఘనంగా ఓటర్ల దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment