మోసం చేశారు.. న్యాయం చేయండి
విజయనగరం క్రైమ్: బుద్ధయోగా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను ఇప్పిస్తామని మోసం చేసిన నిందితులను నిరుద్యోగులు శనివారం నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 మంది అభ్యర్థుల నుంచి రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసి నిలువునా ముంచేశారంటూ ఆందోళన చేశారు. నెలకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు జీతం ఇస్తామని చెప్పి పోస్టుల్లో నియమించి పైసా ఇవ్వకుండా మోసం చేశారంటూ సంస్థ సభ్యులపైన పలువురు నిరుద్యోగులు విజయనగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు హైకోర్టు ఉత్తర్వులతో స్టేషన్ బెయిల్ తీసుకునేందుకు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. విషయం తెలుసుకున్న నిరుద్యోగులు అధికమంది స్టేషన్‌కు చేరుకుని నిందితులను నిలదీశారు. రూ.లక్షల్లో తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మోసం చేశారు.. న్యాయం చేయండి అంటూ సీఐ శ్రీనివాసరావుకు విన్నవించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో షేక్ సయ్యద్ వలీ, లక్ష్మీనారాయణ రెడ్డి, మహీందర్ రెడ్డికి హైకోర్టు ఉత్తర్వులననుసరించి స్టేషన్‌బెయిల్ ఇచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment