● పట్టా భూముల్లో ఇసుక దోపిడీ
● ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’..!
చిత్రంలో కనిపిస్తున్నది గరివిడి మండలం కోనూరు గ్రామంలో ఇసుక కోసం తవ్వేసిన పట్టా భూమి. దశాబ్దాల కిందట ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో గ్రామానికి చెందిన దళిత రైతులు
కొబ్బరి, మామిడి మొక్కలు సాగుచేశారు. వాటి ఫలసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇవి ఇసుక నేలలు కావడంతో కూటమి నాయకుల కళ్లు పడ్డాయి. అంతే... పొక్లెయిన్, జేసీబీ సాయంతో రాత్రీపగలు తేడా లేకుండా ఇసుకను తవ్వేసి సొమ్ముచేసుకుంటున్నారు. ప్రశ్నించిన బాధితులను బెదిరిస్తున్నారు. తవ్వకాలపై రెవెన్యూ అధికారులకు ఇటీవల ఎస్సీ రైతులు ఫిర్యాదు చేశారు. ఆర్‌ఐ అచ్యుతరావు ఇటీవల ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన వస్తున్న సమాచారం ఇసుకా సురులకు ముందుగానే తెలియడంతో జాగ్రత్తపడ్డారు. యంత్రాలు లేకపోవడంతో ఆయన వెనుకకు వచ్చేశారు. అంతే.. మళ్లీ తవ్వకాలు యథాతథంగా మారడం... భూములు కనుమరుగవుతుండడంతో రైతులు గగ్గోలు పెడతున్నారు. తవ్వకాలను అడ్డుకుని భూములకు రక్షణ కల్పించాలంటూ గోడువినిపిస్తున్నారు. ఇదే విషయంపై తహసీల్దార్ సీహెచ్ బంగార్రాజు మాట్లాడుతూ ఇప్పటికే ఆర్‌ఐను పంపించామని, తవ్వకాలతో రెవెన్యూ శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మైనింగ్ అధికారులే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తీసుకుని రావాలని రైతులకు సమాచారం ఇచ్చామన్నారు.
– చీపురుపల్లిరూరల్ (గరివిడి)
Comments
Please login to add a commentAdd a comment