![అక్కర](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/editcartnowaterfarmer_mr-1739216002-0.jpg.webp?itok=eqJXXBQU)
అక్కరకు రానిరైతు బంధు
● నిధులున్నా రైతులకు ప్రయోజనం శూన్యం
● జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు
● రైతు బంధు పథకం అమలుకోసం ఉన్న
నిధులు రూ.4 కోట్లు
విజయనగరం ఫోర్ట్:
రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రైతు బంధు పథకం అక్కరకు రావడం లేదు. పథకంపై రైతులకు కనీస అవగాహన లేకపోవడం... అధికారులు కూడా ప్రోత్సహించకపోవడం కారణాలుగా తెలుస్తున్నాయి. పథకం అమలుకు నిధులు పుష్కలంగా ఉన్నా రైతన్నకు కలిగే ప్రయోజనం శూన్యమే. జిల్లాలో ఒక్క రైతు కూడా పథకాన్ని వినియోగించుకునే దాఖలాలు లేకపోవడం గమనార్హం. కోట్లాది రూపాయలు మార్కెట్ కమిటీల ఖాతాల్లో మూలుగుతున్నా వాటి సద్వినియోగం గురించి ఆలోచించేవారే కరువయ్యారు.
ఇదీ పరిస్థితి...
వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎఎంసీ)ల ద్వారా రైతు బంధు పథకాన్ని అమలు చేయాలి. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, కొత్తవలస, మెరకముడిదాం, చీపురపల్లి, పూసపాటిరేగ, రాజాంలలో మొత్తం 8 వ్యవసాయ మార్కెట్ కమి టీలు ఉన్నాయి. రైతులు పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక పోతే మార్కెట్ కమిటీ గోదాంలో దాచుకోవచ్చు. దీనికోసం రైతులకు రైతు బంధు పథకం కింద ఆరునెలల కాలానికి వడ్డీలేని రుణాలు అందజేయాలి. 6 నెలలు దాటితే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో రైతుకు రూ.2లక్షల వరకు రుణం ఇవ్వవచ్చు. రూ.2 లక్షలు విలువైన, రెండు లక్షల దాటిన పంట అయినా రూ.2 లక్షల రుణం అందజేసేందుకు అవకాశం ఉంటుంది. రూ.2 లక్షలు కంటే పంట విలువ తక్కువగా ఉంటే ఆ మేరకు రుణం అందించాల్సి ఉంది. 6 నెలలులోగా రైతు గోదాంలో దాచిన పంటను విక్రయించి రుణం చెల్లించుకునే వెసులబాటు రైతుకు కలుగుతుంది. దీనివల్ల మద్దతు ధరకు పంటను విక్రయించుకునే వెసులబాటు రైతుకు కలుగుతుంది. వడ్డీలేని రుణం అందజేయడం వల్ల ఆర్థిక కష్టాలను కొంతమేర దూరం చేసుకోవచ్చు.
రూ.4 కోట్లు
నిధులు ఉన్నా...
జిల్లాలో ఉన్న 8 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రైతు బంధు పథకానికి సంబంధి ఒక్కో మార్కెట్ కమిటీలోనూ రూ.50 లక్షల చొప్పన రూ.4 కోట్లు నిధులు ఉన్నాయి. అయితే, ఏ మార్కెట్ కమిటీలోనూ ఈ పథకాన్ని రైతుల కోసం వినియోగించిన దాఖలాలు లేవు. పంట గిట్టుబాటు కాని పక్షంలో రైతులకు రైతుబంధు పథకం ఉపయోగపడుతుంది. జిల్లా రైతులు వరి, మొక్కజొన్న, పెసర, మినుము, నువ్వులు, చోడి, పత్తి, గోగు, వేరుశనగ తదితర పంటల సాగు చేస్తారు. మొక్కజొన్న, పెసర, మినుము, చోడి, పత్తి, గోగు, నువ్వులు, వేరుశనగ పంటలకు ఒక్కోసారి కనీస మద్దతు ధర రాదు. ఇటువంటి పరిస్థితుల్లో గోదాముల్లో పంట ఉత్పత్తిని నిల్వ చేసుకుని రైతు బంధు పథకం కింద రైతులు రుణం తీసుకుని ఉపయోగించుకోవచ్చు. అయితే, సంబంధిత అధికారులు ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత మంచి పథకం ఉందని, వినియోగించుకోవచ్చన్న విషయం కూడా చాలా మంది రైతులకు తెలియకపోవడం గమనార్హం
రైతులు ముందుకు రావడం లేదు
రైతు బంధు పథకానికి సంబంధించి 8 మార్కెట్ కమిటీల్లో నిధులు ఉన్నాయి. రుణాలు తీసుకోవడానికి రైతులు ముందుకు రావడం లేదు. రైతులు దరఖాస్తు చేస్తే రుణాలు మంజూరుచేస్తాం.
– బి.రవికిరణ్, అసిస్టెంట్ డైరెక్టర్,
మార్కెటింగ్ శాఖ
![అక్కరకు రానిరైతు బంధు1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10vzg16-370049_mr-1739216002-1.jpg)
అక్కరకు రానిరైతు బంధు
Comments
Please login to add a commentAdd a comment