రైతు ప్రయోజనాలే ప్రధానం
చీపురుపల్లి రూరల్ (గరివిడి): రైతు ప్రయోజనాలే ప్రధానమని, సాగునీటి ఇబ్బందులు తొలగిస్తా మని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. గరివిడి మండలంలోని దేవాడ గ్రామం వద్ద ఉన్న తోటపల్లి కాలువను, పక్కనే ఉన్న మాంగనీస్, ఐరన్ ఓర్ గనులను సోమవారం పరిశీలించారు. తోటపల్లి కాలువ నుంచి సాగునీరు సమీపంలోని గనుల్లోనికి లీకేజీ అవుతున్నందున నీరు వృథాతో పాటు మైనింగుకు అంతరాయం కలుగుతోందన్న సమాచారం మేరకు ఆయన పర్యటించారు. తోటపల్లి కాలువ నుంచి సాగునీరు లీకేజీ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. మైనింగ్‌కు సంబంధించిన అంశాలను గనులశాఖ అధికారులు, లీజుదారులైన ఆర్‌బీఎస్‌ఎస్‌డీ అండ్ కేఎన్ దాస్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సంబంధిత మ్యాప్‌లు, ప్రస్తుతం కాలువ వెళ్తున్న మార్గాన్ని, గుర్ల మండలంలోని సదానందపురం గ్రామ పరిధిలో ఉన్న గనుల లోపల ప్రాంతాన్ని, నీటి ఊటలను, మైనింగ్ మెటీరియల్ డంప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాడ నుంచి దిగువ ప్రాంతాల్లో సుమారు 28వేల మంది ఆయుకట్టు రైతులు ఉన్నారని, వారందరికీ సాగునీటిని సక్రమంగా అందించాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. తోటపల్లి కాలువ నుంచి నీటి లీకేజీ జరగకుండా, గనుల్లోకి నీరు వెళ్లకుండా సుమారు 100 మీటర్ల వరకు కాలువలో కాంక్రీట్ ఫ్లోరింగ్, కాంక్రీట్‌తో గోడలను నిర్మించాలని కలెక్టర్ సూచించారు. ఈ పనులను రెండు నెలల్లోనే పూర్తిచేయాలని ఆదేశించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి కాలువ మార్గాన్ని కొద్దిగా మార్పు చేయాలని, మైనింగ్ లీజుకు ఇచ్చిన స్థలంలోనే 80 అడుగుల కాలువ తవ్వాలని, అక్కడ కాలువ ఒడ్డు నుంచి గనుల వరకు వంద అడుగుల స్థలాన్ని విడిచి పెట్టాలని సూచించారు. ఈ మేరకు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు కలిసి చర్చించి ప్రతిపాదనలు రెండు రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి, ఇరిగేషన్ ఎస్సీ స్వర్ణకుమార్, మైనింగ్ డీడీ సి.మోహన్‌రావు, రెండు మండలాల తహసీల్దార్లు సీహెచ్ బంగార్రాజు, ఆదిలక్ష్మీ, ఇరిగేషన్ డీఈలు, రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు.
రైతుల సమస్య బొత్స దృష్టికి...
గరివిడి మండలంలోని దేవాడ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు తోటపల్లి కాలువ సమస్యను ఫిబ్రవరి 1న గరివిడి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. తోటపల్లి కాలువ లీకేజీలతో నీరు వృథా కావడంతో సాగునీరు అందక తామంతా నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అప్పుడే హామీ ఇచ్చారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment