ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో గ్రూప్–3 పరీక్షల డీఓలు, ఐడెంటీఫికేషన్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 8,312 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని.. జిల్లా కేంద్రంతో పాటు కొత్తకోటలో 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌కు తన చాంబర్ వరకు మాత్రమే సెల్‌ఫోన్ అనుమతి ఉంటుందన్నారు. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలన్నారు. పరీక్షకు హాజరైయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంటతెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి పి.ఉమాదేవి, లీడ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ సాయి, రీజినల్ కోఆర్డినేటర్ రాంనరేష్‌యాదవ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment