రైతుల సంక్షేమమే ధ్యేయం
పాన్‌గల్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ అన్నారు. బుధవారం మండలంలోని మంగళ్లపల్లిలో పీఏసీఎస్ ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. దళారులు, ప్రైవేటు వ్యాపారులను నమ్మి మోసపోవద్దన్నారు. సన్న వడ్లకు ప్రభుత్వం రూ. 500 బోనస్ అందిస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహబూబ్‌నగర్‌లో ఈ నెల 30న నిర్వహించనున్న రైతు సదస్సుకు జిల్లా నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవికుమార్, మాజీ సర్పంచులు జయరాములుసాగర్, ఆంజి, నాయకులు పుల్లారావు, నరేందర్‌గౌడు, గణేష్ పాల్గొన్నారు.
పకడ్బందీగా నాస్ పరీక్ష
వనపర్తి: జిల్లాలో నాస్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. పెబ్బేరు సమీపంలోని మోడల్ స్కూల్‌లో బుధవారం జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు నాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంఓ మహానంది, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులుతో కలిసి ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డిసెంబర్ 4న జరిగే నాస్ పరీక్షకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా ఇంటర్ విద్యార్థులకు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు. నాస్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తూర్పింటి నరేష్ కుమార్, ఉపాధ్యాయులు చిన్నయ్య, బుచ్చయ్య, కమలాకర్ పాల్గొన్నారు.
కేజీబీవీ, యూఆర్‌ఎస్ ఉద్యోగుల నిరసన
కొత్తకోట రూరల్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, పట్టణ రెనిడెన్షియల్ పాఠశాలలు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మినిమం టైం స్కేలు అమలుపర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు, ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డి.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు ఎండీ హమీద్ మాట్లాడుతూ.. మినిమం టైం స్కేలు సాధన కోసం దశల వారీ పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దశాలవారీ పోరాటంలో భాగంగా పాఠశాల స్థాయిలో నిరసనలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, జిల్లా స్థాయిలో రిలే నిరాహార దీక్ష, బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
టీబీ ప్రోగ్రాంపై
అధ్యయనం
గోపాల్‌పేట: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం రాష్ట్ర టీబీ సెల్, డబ్ల్యూహెచ్‌ఓ బీడీ యూనిట్ అధికారులు డా.మహేష్, డా.శ్రీఘన, డా.బ్లెస్సీ సందర్శించారు. పీహెచ్‌సీ పరిధిలో టీబీ ప్రోగ్రాంపై అధ్యయనం చేశారు. టీబీ ప్రోగ్రాంలో భాగంగా ఏఐ టూల్, యూజర్ ఫ్రెండ్లీ యాప్ అభివృద్ధిపై ఆరా తీశారు. స్థానిక ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లతో సమావేశమై పేషంట్ల సమాచారం సేకరణ తదితర వివరాలను తెలుసుకున్నారు. వారి వెంట డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, డీఐఓ డా.పరిమళ, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ కృష్ణకుమారి, డా. క్లెవిన్‌మార్క్, సీహెచ్‌ఓ సిద్ధగౌడ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment