నేటినుంచి రైతు పండుగ | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి రైతు పండుగ

Published Thu, Nov 28 2024 1:14 AM | Last Updated on Thu, Nov 28 2024 1:14 AM

నేటిన

నేటినుంచి రైతు పండుగ

తొలిరోజు ప్రారంభించనున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన పేరిట విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో రైతు పండగ పేరిట మూడు రోజుల పాటు ప్రత్యేక రైతు సదస్సు జరపనుంది. ఇందుకోసం భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లో రైతు పండగ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కలెక్టర్‌ విజయేందిర ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఏర్పాట్ల గురించి అధికారులతో వివరాలు తెలుసుకుంటున్నారు.

రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం

జిల్లాలో జరగనున్న మూడు రోజుల రైతు సదస్సు కార్యక్రమాలను రైతులు, ప్రజలు తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 560 రైతువేదికల్లో ప్రత్యేక ప్రసారాలు చేయనున్నారు. సదస్సులో ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, మత్స్య శాఖ తదితర రంగాలకు చెందిన ఆదర్శ రైతులచే ప్రసంగాలు, విజయగాధలపై వీడియో ప్రదర్శనలు ఉంటాయి. ఒక్కొక్క పంటకు సంబంధించిన రైతులను గుర్తించి వారి అనుభవాలు వివరిస్తారు.

భోజన వసతి..

రైతు పండగకు వచ్చే రైతులు, ప్రజాప్రతినిధులల కోసం భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున వచ్చే రైతుల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, భోజనం, తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని మంత్రులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రైతు సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు పరిశీలించారు.

150 స్టాళ్లు ఏర్పాటు..

రైతు పండగ సందర్భంగా వేదికలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ రైతు పండగలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అన్ని రైతులకు సంబంధించిన అంశాలపై ప్రదర్శన, శిక్షణ, అవగాహన, ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో వస్తున్న ఆవిష్కరణలు, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, విత్తనోత్పత్తులు, హార్టికల్చర్‌, ఆడ్రిప్‌ అగ్రికల్చర్‌, వరి నాట్లు వేసే పరికరాలు ఇలా అన్నింటిపై రైతులకు అవగాహన కల్పించేలా స్టాళ్లు ఏర్పాటు చేశారు.

రైతు పండగలో ఏర్పాటు చేసిన స్టాళ్లు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అమిస్తాపూర్‌లో రైతు పండగ ఏర్పాట్లను పరిశీలించి.. కలెక్టర్‌ విజయేందిరను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతు స్టాళ్లు, అవగాహన సదస్సు వేదిక, పబ్లిక్‌ మీటింగ్‌ ఏర్పాట్లు, రాష్ట్రంలోని నలుమూలల నుంచి రానున్న రైతులకు వాహన పార్కింగ్‌, భోజన ఏర్పాట్లను పరిశీలించి.. పకడ్బందీగా చేయాలని సూచించారు. రైతులు పండించిన పంటలను ప్రదర్శించుకోడానికి దాదాపు 120 స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు స్టాళ్లు పరిశీలించిన తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులు అవగాహన కల్పిస్తారన్నారు. రైతు పండగను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

పకడ్బందీగా ఏర్పాట్లు

30న సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

ప్రతిరోజు 5 వేల మంది రైతులు పాల్గొనేలా చర్యలు

150 స్టాళ్ల ద్వారా అవగాహన

కార్యక్రమాలు

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు,

కలెక్టర్‌ విజయేందిర

ముగ్గురు మంత్రులు..

గురువారం ఉదయం 10 గంటలకు రైతు సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారు. తొలిరోజు సదస్సుకు ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.

శుక్రవారం రెండోరోజు రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు హాజరు కానున్నారు. సుమారు 5 వేల మంది రైతులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

శనివారం మూడోరోజు రైతు సదస్సు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సభ ఉంటుంది. ఈ సభకు సుమారు లక్ష మంది రైతులు పాల్గొనేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేటినుంచి రైతు పండుగ 1
1/1

నేటినుంచి రైతు పండుగ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement