బోనస్ వచ్చేసింది..
●
సన్నరకం ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు
రెండు రోజుల వ్యవధిలోనే..
కొనుగోలు కేంద్రానికి వరిధాన్యం తీసుకెళ్లి తేమ శాతం తగ్గేందుకు మూడు రోజులపాటు ఆరబెట్టాను. మూడు రోజుల క్రితం ధాన్యాన్ని అమ్మాను. మొత్తం 70 క్వింటాళ్లు విక్రయించగా.. ధాన్యం డబ్బులతో పాటు అదనంగా మరో రూ. 35వేలు బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి.
– సత్యారెడ్డి, రైతు, నాగల్‌కడ్మూర్
ఎప్పటికప్పుడు ఆన్‌లైన్..
ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. రైతు పేరుతో పాటు సర్వే నంబర్, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలను పూర్తి స్థాయిలో పొందుపరుస్తున్నాం. నమోదు చేసిన రెండు రోజుల్లోనే రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు అందుతున్నాయి.
– పావని,
డేటా ఎంట్రీ ఆపరేటర్, పాంరెడ్డిపల్లె
అమరచింత: రైతుల పంట పండింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన సన్నరకం వరిధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ధాన్యం డబ్బులతో పాటు బోనస్ అందుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే మొదట ధాన్యం సేకరణలో కొంత జాప్యం జరగడంతో అనేక మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్నారు. మరికొందరు రైతులు కల్లాలోనే నిల్వ చేసుకున్నారు. కొన్ని రోజులుగా అధికార యంత్రాంగం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు డబ్బుల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఎకరా పొలంలో సుమారుగా 30 క్వింటాళ్ల వరిని పండించిన రైతుకు మద్దతు ధరతో పాటు క్వింటా రూ. 500 చొప్పున బోనస్ రూపంలో రూ. 15వేలు వస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మ్యాచరైజ్ మిషన్లు అన్ని కొనుగోలు కేంద్రాల్లో లేక పోవడంతో కొనుగోలు కాస్త ఆలస్యమవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
వరి కొనుగోలు చేసిన వెంటనే రైతు వివరాలను ప్రత్యేక యాప్‌లో పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో రైతులకు రెండు లేదా మూడు రోజుల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించే విదంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చిన వరిని తేమ శాతం చూసిన వెంటనే కాంటా చేస్తున్నారు.
వేగవంతంగా డేటా ఎంట్రీ..
అమరచింత మండలం ఈర్లదిన్నెకు చెందిన రైతు శ్రీనివాసులు తనకున్న రెండెకరాల్లో వానాకాలం వరిపంట పండించాడు. ప్రభుత్వం సన్నరకం వరికి క్వింటా రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో 60 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకున్నాడు. అమ్మిన రెండు రోజుల వ్యవధిలోనే క్వింటాకు మద్దతు ధర రూ. 2,320 డబ్బులతో పాటు బోనస్ బ్యాంకు ఖాతాలో జమ కావడంతో ఆ రైతు సంతోషం అంతా ఇంతా కాదు.
జిల్లాలో కొనసాగుతున్న కొనుగోళ్లు
ఇప్పటి వరకు 38వేల మెట్రిక్ టన్నుల సేకరణ
రైతుల ఖాతాల్లో రూ. 51 కోట్లు జమ
బోనస్ రూపంలో మరో రూ. 2 కోట్లు..
చెల్లింపుల్లో వేగం..
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఎలాంటి జాప్యం లేకుండా డబ్బులు చెల్లించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పటి వరకు జిల్లా మొత్తంలో 38 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. రైతుల ఖాతాల్లో రూ. 50కోట్లతో పాటు బోనస్ రూ. 2 కోట్లు చెల్లించాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.
– రమేష్, సివిల్ సప్లై డీఎం
Comments
Please login to add a commentAdd a comment