ఆన్సర్‌ బుక్‌లెట్‌లనే మార్చేశాడు! | - | Sakshi
Sakshi News home page

ఆన్సర్‌ బుక్‌లెట్‌లనే మార్చేశాడు!

Published Wed, Oct 11 2023 7:24 AM | Last Updated on Wed, Oct 11 2023 7:24 AM

- - Sakshi

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో పాసయ్యేందుకు కొందరు పరీక్షలు రాసేటప్పుడే కాపీయింగ్‌కు పాల్పడుతుంటారు. అందులో కొందరు స్క్వాడ్లకు పట్టుబడి డీబార్‌ కూడా అవుతుంటారు. పరీక్షల ఫలితాలు వచ్చాక రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసి పాసయ్యేందుకు పైరవీలు చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ మరో రకం పైరవీ జరిగింది. యూనివర్సిటీలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగి అడ్డదారిలో పాసయ్యేందుకు ఏకంగా ఆన్సర్‌ షీట్లను పరీక్షల విభాగంలో పనిచేసే ఇద్దరు తాత్కాలిక ఉద్యోగుల(దినసరి వేతన) సహకారంతో మార్చాడు. ఈ విషయం కొన్నినెలల క్రితమే పరీక్షల విభాగం అధికారుల దృష్టికి రాగా గోప్యంగా ఉంచారు. ఇద్దరి తాత్కాలిక ఉద్యోగులను విధులనుంచి తొలగించారు. కానీ ఆ రెగ్యులర్‌ ఉద్యోగిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యా కేంద్రంలో బీఎల్‌ఐఎస్సీ ఏడాది కోర్సు ఉంది. 2021–2022 విద్యాసంవత్సరంలో ఈ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు యూని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ ఏడాది జనవరి 12నుంచి నెలాఖరువరకు పరీక్షలు నిర్వహించారు. జవాబుపత్రాలు వాల్యూయేషన్‌ కోసం పరీక్షల విభాగానికి పంపారు. వాల్యూయేషన్‌ కంటే ముందుగా పరీక్షల విభాగంలో (దూరవిద్య) క్యాంపులో జవాబుపత్రాలను కోడింగ్‌, డీ కోడింగ్‌ (దిద్దే వారికి ఎవరికి ఏ సబ్జెక్టు వెళ్లాలో) చేస్తారు. ఇదిలా ఉండగా ఈ బీఎల్‌ఐఎస్సీ పరీక్షను క్యాంపస్‌లోని మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగి రాశాడు. పరీక్షలు బాగా రాయకపోవడంతో ఫెయిలవుతానని నిర్ధారించుకున్నాడు. ఎలాగైనా పాసవ్వాలని నాలుగు సబ్జెక్టులకు సంబంధించి ఇంటివద్ద యూనివర్సిటీకి చెందిన ఆన్సర్‌ బుక్‌లెట్‌లలోనే జవాబులు రాసుకున్నాడు. పరీక్షల విభాగంలో సంబంధిత సెక్షన్‌లో పనిచేసే ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను మచ్చిక చేసుకున్నాడు. వారికి డబ్బు ఎర చూపాడు. దీంతో తాత్కాలిక ఉద్యోగులు.. సదరు ఉద్యోగి ఇచ్చిన నాలుగు సబ్జెక్టుల జవాబుపత్రాల బుక్‌లెట్‌లను తీసుకెళ్లి అంతకుముందు ఆ ఉద్యోగి పరీక్షలో రాసిన ఆన్సర్‌ బుక్‌లెట్లను తొలగించి వాటిస్థానంలో చేర్చారు. వాల్యూయేషన్‌ పూర్తయ్యాక గత జూన్‌ 24న ఫలితాలు విడుదల చేశారు. 231మంది విద్యార్థులకుగాను 88 మంది ఉత్తీర్ణత సాధించారు.

అయినా ఫెయిలయ్యాడు..

తీరా ఫలితాలు చూసుకున్న సదరు ఉద్యోగి అవాక్కయ్యాడు. మార్చిన ఆన్సర్‌ షీట్లలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. జవాబులన్నీ కరెక్టే రాశాను కదా ఎలా ఫెయియ్యాననేది అంతుపట్టక.. తరచూ పరీ క్షల విభాగంలోని అదనపు పరీక్షల నియంత్రణాఽ దికారి డాక్టర్‌ ఎ.నరేందర్‌కు ఫోన్‌ చేశాడు. తాను పరీక్ష బాగా రాశాను.. ఎలా ఫెయిల్‌ అవుతాను అంటూ చెప్పినట్లు సమాచారం. ఫలితాలు సరిగానే ఇచ్చామని అదనపు పరీక్షల నియంత్రణాధికారి చెప్పారని తెలుస్తోంది. అయినప్పటికీ మళ్లీ, మళ్లీ ఫోన్‌లు చేసి అడుగుతుండటంతో అనుమానం వచ్చింది. ఆ ఉద్యోగి రాసిన ఆన్సర్‌ బుక్‌లెట్లను పరిశీలించారు. నాలుగు సబ్జెక్టుల ఆన్సర్‌ బుక్‌లెట్‌లను మార్చినప్పుడు ఆ దినసరి వేతన ఉద్యోగులు కోడింగ్‌, డీకోడింగ్‌ను తప్పుగా ముద్రించారు. దీంతో ఒక సబ్జెక్టుకు బదులుగా మరో సబ్జెక్టుకు కోడింగ్‌ కావడం వల్ల ఒక అధ్యాపకుడు దిద్దే సబ్జెక్టుకు మరో సబ్జెక్టు ఆన్సర్‌షీట్‌ వెళ్లడంతో వాల్యుయేషన్‌లో ఫెయిల్‌ చేసినట్లు గుర్తించారు. మార్చిన వాటిలో మరో రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాడు.

బీఎల్‌ఐఏస్సీలో పాసయ్యేందుకు ఓ రెగ్యులర్‌ ఉద్యోగి నిర్వాకం

సహకరించిన కేయూ పరీక్షల

విభాగంలోని ఇద్దరు తాత్కాలిక

ఉద్యోగులు

ఇద్దరినుంచి రెండు సెల్‌పోన్లు

స్వాధీనం.. విధులనుంచి తొలగింపు

విచారణ కమిటీ నియామకం..

గోప్యంగా విచారణ.. నివేదిక అందజేత

విచారణ కమిటీ నియామకం :

నివేదిక అందజేత

ఈ వ్యవహారంపై కొన్నినెలల క్రితమే యూనివర్సిటీ అధికారులు విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీలో పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పెండ్లి అశోక్‌బాబు, మరో ప్రొఫెసర్‌ ఉన్నారని సమాచారం. వీరు విచారణ పూర్తిచేసి నివేదికను ఇటీవల వీసీ, రిజిస్ట్రార్‌లకు అందజేశారు. ఇంత జరిగినా విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం.

విధులనుంచి తొలగించి సెల్‌ఫోన్‌లు స్వాధీనం

పరీక్షల విభాగంలో ఆన్సర్‌షీట్లను మార్చిన ఇద్దరి దినసరి వేతన ఉద్యోగులను గుర్తించిన పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి.. వారినుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్సర్‌షీట్లను ఎలా మార్చారు.. ఎవరు ఇచ్చారు. మార్చినందుకు ఎన్ని డబ్బులు ముట్టాయన్న సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఆ తరువాత వారిద్దరిని విధులనుంచి తొలగించారు. ఇంకా ఏదైనా పరీక్షల జవాబుపత్రాలు మార్చి ఉంటారా అనే కోణంలో కూడా విచారించినట్లు తెలుస్తోంది. ఆన్సర్‌షీట్లను మార్పిడి చేయించుకున్న మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల రెగ్యులర్‌ ఉద్యోగుస్తుడిని కూడా పిలిపించి మాట్లాడారని, అతను అంగీకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారం జూలైలో బయటపడినట్లు యూనివర్సిటీ వర్గాల ద్వారా తెలిసింది.

ఆన్సర్‌ బుక్‌లెట్లు అతడికి ఎలా వచ్చాయి?

పరీక్షలు జరిగినప్పుడే ఆ ఉద్యోగి ఇన్విజిలేటర్ల కళ్లు కప్పి మిగులుగా ఉండే ఆన్సర్‌బుక్‌లెట్లను తీసుకెళ్లాడని తెలుస్తోంది. లేకపోతే ఎవరైనా సహకరించారా అన్నది తెలియాలి. కాగా, ఇదంతా విచారణ జరుగుతుండగా పరీక్షల విభాగంలో పనిచేసే మరో దినసరి వేతన ఉద్యోగి విధులకు రాకుండా వెళ్లిపోయాడు. అతడు కూడా ఏమైనా చేసి ఉంటారనే కోణం కూడా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement