వదలం..కదలం | - | Sakshi
Sakshi News home page

వదలం..కదలం

Published Mon, Jan 13 2025 1:11 AM | Last Updated on Mon, Jan 13 2025 1:11 AM

వదలం..కదలం

వదలం..కదలం

బదిలీ.. పదోన్నతి.. నెలరోజులకే డిప్యుటేషన్‌!

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

‘వడ్డించే వాడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్న ఒక్కటే’ అన్నట్లుంది ఉమ్మడి వరంగల్‌ జిల్లా పశుసంవర్థక శాఖలో కొందరు అధికారుల పరిస్థితి. ప్రమోషన్లకు ముందు.. తర్వాత కోరుకున్న చోటే ఉండాలనుకుంటున్నారు కొందరు. ఆ కొందరి కోరిక తీర్చడం కోసం ఉన్నతాధికారులు వారు కోరుకున్న స్థానాలను పదిలంగా ఉంచి ‘డిప్యుటేషన్‌’ల పేరిట వారితోనే నింపేస్తున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి జిల్లా వెటర్నరీ, పశుసంవర్థకశాఖ అధికారులుగా పదోన్నతులు కలిగిన కొందరు ఫారిన్‌ సర్వీసుల పేరిట డిప్యుటేషన్‌ పొందారు. అందులో కొందరు ఐదారు నెలల్లో పదవీ విరమణ పొందే ‘బాస్‌’ సీటుపై కన్నేశారని కూడా ఆ శాఖలో చర్చించుకుంటున్నారు. ఇంకొందరు ఇతర జిల్లాలకు వెళ్లినా.. తిరిగి ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో డిప్యుటేషన్‌పై చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పశుసంవర్థకశాఖలో సాగుతున్న ఈ అక్రమ డిప్యుటేషన్ల తంతు ఆ శాఖ అధికారులు, సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ఫిర్యాదు ఏకంగా ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌ పేషీకి చేరడం చర్చనీయాంశంగా మారింది.

పైరవీలే ప్రామాణికం..

ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న ఏ స్థాయి వారికైనా బదిలీలు, పదోన్నతులు, డిప్యుటేషన్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. కానీ.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా ఆ నిబంధనలు అపహాస్యం అవుతున్నాయి. పశుసంవర్థకశాఖ హనుమకొండ జిల్లాలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కేడర్‌లో పనిచేసిన ఇద్దరికీ ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా స్థానచలనం కలిగింది. పరకాల ఏరియాలోని ఏడీకి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు.. హనుమకొండ డీవీఏహెచ్‌ఓ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న మరొకరికి భీమదేవరపల్లి మండలానికి బదిలీ అయ్యింది. ఈ బదిలీ ఉత్తర్వులు వెలువడిన సుమారు వారం రోజుల్లోనే అవసరాలు, సీనియార్టీ ప్రకారం పదోన్నతుల జాబితా వెల్లడైంది. అందులో సాధారణ బదిలీల్లో భీమదేవరపల్లికి వెళ్లిన అధికారిని కామారెడ్డి జిల్లా వెటర్నరీ, ఎనిమల్‌ హజ్బెండరీ అధికారి (డీవీఏహెచ్‌ఓ)గా నియమించారు. పరకాల నుంచి హుజూరాబాద్‌కు వెళ్లిన మరో అధికారికి పదోన్నతి కల్పించి డీవీఏహెచ్‌ఓగా ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అవసరాన్ని గుర్తించే జిల్లా అధికారులుగా వారిని నియమించారు. కనీసం ఐదారు రోజులైనా అక్కడ లేకుండా ఒకరు కరీంనగర్‌లోని ప్రోజెన్‌ సెమన్‌ బుల్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌బీఎస్‌)కు, మరొకరు వెటర్నరీ కాలేజీ టీచింగ్‌ ఫ్యాకల్టీగా తిరిగి వరంగల్‌కు చేరడం ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

ఎడాపెడా డిప్యుటేషన్లు..

దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న.. ఇతర ప్రాంతాల్లో అవసరం ఉన్న పలువురిని ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన చోట పని చేయలేమని పైరవీలు చేసుకున్న పలువురికి కొందరు అధికారులు ఎడాపెడా డిప్యుటేషన్లు ఇచ్చారు.

కరీంనగర్‌ నుంచి హనుమకొండ జిల్లా ఐనవోలు మండలానికి బదిలీపై వచ్చిన ఓ అధి కారి కొంతకాలం పనిచేసి.. ఓ ముఖ్యనేత సిఫారసుతో కరీంనగర్‌ జిల్లా మానకొండూ రుకు ‘డిప్యుటేషన్‌’ చేయించుకున్నాడు.

మహబూబాబాద్‌కు చెందిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు జనరల్‌ ట్రాన్స్‌ఫర్స్‌లో పెద్దపల్లి జిల్లా కు బదిలీ కాగా.. ఖాళీగా ఉన్న భీమదేవరపల్లి మండలానికి డిప్యుటేషన్‌పై వచ్చారు.

హనుమకొండ నుంచి హుజూరాబాద్‌కు ఏడీగా బదిలీ అయి డీవీఏహెచ్‌ఓ పదోన్నతి పై వెళ్లిన అధికారి స్థానంలో జోన్‌–1 పరిధి నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన ఓ అధికారిని నియమించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరు ఎల్కతుర్తి మండలానికి వచ్చారు.

వరంగల్‌ నగరంలో నివాసం ఉండే ఏడీ స్థాయి ఒకరు, వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట నుంచి మరో అధికారి ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు బదిలీ అయినా... అక్కడి ఉన్నతాధికారులను మెప్పించి ఇక్కడిక్కడే తిరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

వీరు డిప్యుటేషన్లకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పాసులు తీసుకుని అడపాదడపా వెళ్తున్నారన్న చర్చ ఆ శాఖలో చర్చ ఉంది.

ఇలా ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా ఎడాపెడా సాగిన ‘డిప్యుటేషన్‌’ల దందాపై ఆ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

పశుసంవర్థకశాఖలో బాగోతం

సీఎం చూస్తున్న శాఖలో ఇష్టారాజ్యం

డీవీఏహెచ్‌ఓలు, వీఏఎస్‌లదీ ఇదే కథ

ఫారిన్‌ సర్సీసుల పేరిట తిష్టకు యత్నం

డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర చర్చ..

స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పేషీకి ఫిర్యాదులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement