అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈనెల 26 నుంచి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మొదలుకానున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ పథకాలపై ఆదివారం హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ అని, అనివార్య కారణాలతో మొదటి విడతలో అర్హత ఉండి లబ్ధి చేకూరని వాళ్లకు తర్వాత విడతల్లో లబ్ధి చేకూరుతుందనే భరోసా అధికారులు ఇవ్వాలన్నారు. పేదోడి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయ్యిందని పేర్కొన్నారు. గడిచిన సంవత్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మరికొన్ని సంక్షేమ పథకాలను పేద ప్రజల దరి చేర్చాలనే సదుద్దేశంతో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నాలుగు సంక్షేమ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. అర్హత ఉండి.. ఏదైనా కారణాల రీత్యా రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక యాప్‌లో నమోదు కాకపోతే వాటిని మ్యాన్యువల్‌గా నమోదు చేసుకుని తర్వాత విడతల్లో లబ్ధి చేకూరుతుందనే భరోసా ముందుగానే ఇవ్వాలని సూచించారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉండాలని, ఆ దిశగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్.నాగరాజు, హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్ వినయ్‌కృష్ణారెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద, షేక్ రిజ్వాన్ బాషా, దివాకర, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఐటీడీఏ పీఓ మిశ్రా, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి పొంగులేటిని మంత్రులు సన్మానించారు.
కాంగ్రెస్ హయాంలో సంక్షేమం నిరంతర ప్రక్రియ
మొదటి విడతలో పేరు లేని వారికి తర్వాతి విడతల్లో లబ్ధి
ప్రజాపాలన యాప్‌లో నమోదుకాని దరఖాస్తులు మ్యాన్యువల్‌గా నమోదు
ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment