పత్తికి తేమ తంటా..
రైతులు మార్కెట్‌కు వాహనాల్లో తెచ్చిన పత్తి
వరంగల్: ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించిన అన్నదాతలకు ఏటా నష్టాలే మిగులుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) ప్రకటించినా తేమ శాతం నిర్ధేశించడంతో రైతులు దిగాలు పడిపోతున్నారు. మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రకటనలిస్తున్నారే తప్ప సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కష్టాలతోనే ఖరీఫ్..
ఈ ఏడాది ఖరీఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కష్టాలతోనే సాగింది. ప్రారంభంలో వర్షాభావం నెలకొనడంతో విత్తన స్థాయిలోనే పెట్టుబడులు ఎక్కువయ్యాయి. దీంతోపాటు అనుకూలించని వాతావరణం దిగుబడులపై ప్రభావం చూపింది. వచ్చిన కాస్త దిగుబడులకు గిట్టుబాటు ధర దక్కుతుందా.. అంటే అదీ లేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పత్తికి మద్దతు ధర ఆశించిన మేరకు ఉన్ననప్పటికీ తేమ శాతంతో తక్కువ ధరకు అమ్ముకోక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. పత్తిలో తేమ 8 నుంచి 12 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు, అంతకంటే ఎక్కువ తేమ ఉన్న పత్తికి వ్యాపారులు ఇష్టం వచ్చిన ధర చెల్లిస్తుండడంతో జిల్లా యంత్రాంగం, మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహించక తప్పడం లేదు.
నిబంధనలతో చిక్కు..
మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా సీసీఐ నిబంధనలు పత్తి అమ్మకాలకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ప్రధానంగా పత్తిలో తేమ శాతాన్ని బట్టి సీసీఐ ధర నిర్ణయిస్తుంది. నిబంధనల ప్రకారం తేమ 8 నుంచి 12శాతం ఉంటేనే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సీసీఐ అంటోంది. తేమ శాతం పెరిగిన కొద్దీ ధర తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న పత్తిలో 12 నుంచి 20 శాతం, అంతకంటే ఎక్కువే తేమ ఉంటోంది. ఈ నేపథ్యంలో మద్దతు ధర లభించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు మద్దతు ధర కావాలని పలుమార్లు డిమాండ్ చేస్తున్నా.. నిబంధనలు ఒప్పుకోవని సీసీఐ అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలను కొంతమేరకు సడలించి సీసీఐ పత్తిని కొనుగోళ్లు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతు సంఘాలు తెలుపుతున్నాయి.
గరిష్ట ధర లభించేలా
పర్యవేక్షిస్తున్నాం..
ప్రస్తుతం మార్కెట్‌కు వచ్చే పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉంటోంది. దీంతో సీసీఐ నిబంధనల మేరకు ఉన్న పత్తిని కొనుగోలు చేస్తోంది. తేమ ఎక్కువ శాతం ఉన్న పత్తిని వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. సోమవారం ఏనుమాముల మార్కెట్ పరిధి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరలతో సుమారు వెయ్యి క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. సీసీఐ కేంద్రాలను మినహాయిస్తే మార్కెట్‌కు వచ్చిన పత్తిలో 12 నుంచి 20శాతం వరకు తేమ ఉంటున్నది. ఈరోజు జెండా పాటలో క్వింటా పత్తికి గరిష్ట ధర రూ.6910, కనిష్టంగా రూ.5500 ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు. యార్డుల్లో పత్తి రైతులకు గరిష్ట ధరలు లభించే విధంగా పర్యవేక్షిస్తున్నాం.
– పి.నిర్మల, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి
ధర తక్కువగా చెల్లిస్తున్నారు..
మార్కెట్‌కు 17 బస్తాల పత్తి తెచ్చిన. జెండా పాటలో క్వింటాకు రూ.6910 ధర నిర్ణయించి చెల్లించారు. తేమ ఎక్కువగా ఉన్నదని వ్యాపారులు తక్కువ ధర ఇస్తున్నారు. పెట్టుబడి అప్పులు తీర్చడానికి మార్కెట్‌కు తెచ్చిన పత్తిని వ్యాపారులు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. .
– అదరు భిక్షపతి, దామెర(ఎల్కతుర్తి)
దిగుబడి తగ్గింది..
మార్కెట్‌కు 29 బస్తాల పత్తి తీసుకువచ్చాను. పంట సాగు పెట్టుబడి పెరిగింది. అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. ఎకరాకు 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే కొంత మంది రైతులు పత్తి ఏరిన తర్వాత తొలగించి మొక్కజొన్న వేసేందుకు సిద్ధమవుతున్నారు.
– సంజీవరెడ్డి, ఇస్సీపేట(మొగుళ్లపల్లి)
●
ధరలు తగ్గడంపై రైతుల ఆవేదన
చేతులెత్తేసిన ప్రభుత్వ యంత్రాంగం
ప్రేక్షక పాత్రలో
మార్కెటింగ్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment