ప్రశ్నలు.. నిరసనలు
జిల్లావ్యాప్తంగా మొదలైన గ్రామ, వార్డు సభలు
సాక్షి, వరంగల్: ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు మొదలయ్యాయి. ఈ నెల 25 వరకు జరగనున్న ఈ సభల నేపథ్యంలో లబ్ధిదారుల వివరాలు వెల్లడించడంతోపాటు జాబితాల్లో పేర్లు లేని వారి నుంచి దరఖాస్తులు తీసుకొని చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో చాలాచోట్ల తమ పేర్లు ఎందుకు లేవు.. అని ప్రజలు అధికారులను నిలదీ శారు. ఇచ్చినవారికే పథకాలు ఇస్తారా.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయా గ్రామసభల్లో పాల్గొన్న అధికారుల సూచనల మేరకు తమ దరఖాస్తులు ఇచ్చారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు చేర్చాలంటూ ప్రజలు విజ్ఞప్తి చేశారు. అయితే నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని నిరసనకు దిగారు. మరోవైపు భూమి లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇచ్చే రూ.12 వేల పథకంలో వందల మంది భూమి ఉన్న రైతుల పేర్లు అర్హుల జాబితాలో ఉండడంతో గ్రామసభల్లో ప్రజల నుంచి అధికారులకు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే అధికారులు మరోమారు జాబితాను పరిశీలించి, 360 డిగ్రీ యాప్ ద్వారా అర్హులకే పథకం వచ్చేలా చూస్తామని అధికారులు ప్రజలకు సమాధానమిచ్చారు.
అర్హుల జాబితాలో అనర్హుల పేర్లు..?
ప్రభుత్వం వెల్లడించిన పలు పథకాల అర్హుల జాబితాల్లో అనర్హుల పేర్లు ఉన్నాయని గ్రామసభల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దుగ్గొండి మండలంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 994 మంది లబ్ధిదారులుంటే వీరిలో సుమారు 200 మంది భూమి ఉన్న రైతులేనని స్థానికుల నుంచి ఆరోపణలు వచ్చాయి. అయితే సొంతూళ్లలో భూమి లేదని మాత్రమే చూసిన అధికారులు.. వారికి ఇతర ప్రాంతాల్లో ఉన్న భూములు పరిగణనలోకి తీసుకోకుండానే జాబితా సిద్ధం చేశారనే విమర్శలు వినిపించాయి. ఇదిలాఉండగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎంపికై న గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన అర్షం మనోజ్ తనను ఆ పథకం నుంచి తప్పించాలంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించడం గమనార్హం.
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి నల్లబెల్లి మండలంలోని ఆసరవెల్లి గ్రామానికి చెందిన నూరవత్ వీరస్వామి. ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడంతో పూరిగుడిసెలో ఉంటున్న తను దరఖాస్తు చేశాడు. సర్వేలో భాగంగా అధికారులు ఇంటికి వచ్చి వీరస్వామి భార్య సునితను ఫొటోలు తీసుకున్నారు. కానీ, అర్హుల జాబితాలో పేరు లేకపోవడంతో విస్మయానికి గురై గ్రామసభలో అధికారులను సంప్రదించాడు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశాడు.
– నల్లబెల్లి
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల
జాబితా ప్రదర్శన
అనర్హులకు చోటుపై నిలదీత
పలుచోట్ల ప్రజల నిరసన అనంతరం దరఖాస్తుల స్వీకరణ
గ్రామసభలు, దరఖాస్తులు ఇలా..
గ్రామసభలు 68
వార్డు సభలు 19
రేషన్‌కార్డులకు దరఖాస్తులు 7,615
ఇందిరమ్మ ఇళ్ల కోసం 4,921
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 1,909
కలెక్టర్‌కు ఫిర్యాదు..
ప్రభుత్వ పథకాల్లో అర్హులకు కాకుండా అనర్హులకు అధికారులు అవకాశం కల్పించినట్లుగా గుర్తించిన పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నల్లబెల్లి మండలంలోని ఓ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది కాంగ్రెస్ నాయకులతో కుమ్మకై అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అర్హుల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment