అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు
నర్సంపేట/నల్లబెల్లి: అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు వర్తించేలా చర్చలు చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలపై మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. నర్సంపేట పట్టణం, నల్లబెల్లి మండలంలోని రేలకుంట, అర్శనపల్లి, అర్వయ్యపల్లి, కన్నారావుపేట, ఆసరవెల్లి, కొండాపూర్ గ్రామసభలు నిర్వహించగా.. సర్వాపురం ముదిరాజ్ కాలనీ, రేలకుంట, అర్శనపల్లి గ్రామసభలో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈసందర్భంగా అర్హుల జాబితాలో పేర్లు లేనివారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రామసభలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించేందుకు అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని.. పాఠశాల, గ్రామ పంచాయతీ సమీపంలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన బెల్టు షాపులను తొలగించాలని కలెక్టర్‌ను కోరారు. కొండాపూర్ గ్రామసభలో రంగయ్యచెరువు రిజర్వాయర్ నిర్మాణంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, గిరిజనేతరులకు అటవీ హక్కు పత్రాలు అందించాలని అధికారులకు వినతి పత్రాలను అందించారు. ఆసరవెల్లిలో రేషన్ షాపును ఏర్పాటు చేయాలని, ఆసరవెల్లి సబ్ సెంటర్‌ను రాంపూర్‌లో నిర్మించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జోనా, మండల ప్రత్యేకాధికారి గోవిందరాజన్, తహసీల్దార్ కృష్ణ, పశువైద్యాధికారి సురేష్, డీఈ రవి, ఎంపీడీఓ నర్సింహమూర్తి, ఎంపీఓ రవి, ఐబీ ఏఈ పవిత్ర, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రభావతి పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
Comments
Please login to add a commentAdd a comment