రసాభాసగా గ్రామసభలు
కమలాపూర్: మండలంలోని పలుగ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలు రసాభాసగా మారాయి. సంక్షేమ పథకాలకు అనర్హులను ఎంపికచేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దేశరాజుపల్లి, గూడూరు, కన్నూరు, శనిగరం గ్రామాల్లో అధికారులు మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల ముసాయిదా జాబితాలను పంచాయతీ కార్యదర్శులు చదివి వినిపించారు. గూడూరులో ఇందిరమ్మ ఇళ్లకు 1,192 మంది అర్హులు కాగా.. 555 మందికి సంబంధించిన జాబితాను మాత్రమే కార్యదర్శి చదివి వినిపించాడు. శనిగరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు కార్యదర్శులతో వాగ్వాదం చేశారు. అనర్హులను జాబితాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. నాలుగు గ్రామాల్లో 682 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీఓ బాబు, తహసీల్దార్ సురేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment