పశ్చిమ గోదావరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చిన ఘటన ఆకివీడులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై సత్యసాయి తెలిపిన వివరాల ప్రకారం.. ఆకివీడుకు చెందిన మారడుగుల వీర వెవెంకట సత్యనారాయణ పెద్ద కుమార్తె సాయి లక్ష్మీ కమల సంధ్యను స్థానికంగా నివసించే వి.రాంబాబు అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 18 నెలల కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం రాంబాబు చైన్‌స్నాచింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది.
భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో విడాకుల కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక భీమేశ్వరస్వామి ఆలయానికి తండ్రి సత్యనారాయణతో కలిసి వెళ్లింది. ఆలయం నుంచి బయటకు వచ్చిన సంధ్యను అప్పటికే కాపుకాసి ఉన్న రాంబాబు విచక్షణారహితంగా చాకుతో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి కేకలు వేస్తూ రక్తపు మడుగులో ఉన్న కుమార్తె వద్దకు వచ్చేసరికి రాంబాబు పరారయ్యాడు.
గుడి నుంచి బయటకు వచ్చిన సంధ్యతో తనపై ఉన్న విడాకుల కేసును ఉపసంహరించుకోవాలని రాంబాబు చెప్పగా ఆమె నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనాథ్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
మృతదేహంతో ధర్నా
సంధ్య హంతకుడిని కఠినంగా శిక్షించాలని సీపీఎం ఆధ్వర్యంలో మృతురాలి బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. డీఎస్పీ వచ్చే వరకూ ధర్నా కొనసాగించారు. రెండు గంటలకు పైగా ధర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.
కొవ్వత్తులతో ప్రదర్శన
సంధ్య ఆత్మకు శాంతి చేకూరాలని, సంధ్య కుటుంబానికి న్యాయం జరగాలని ఆకివీడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్, ఎస్సైకి వినతిపత్రం అందజేశారు. ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment