ఉద్యోగ విరమణ అయినా.. విశ్రాంతి లేదు
ఏలూరు(మెట్రో) : ప్రభుత్వ ఉద్యోగంలో సుదీర్ఘ సేవలందించి 62 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు కూటమి సర్కారు పరీక్ష పెడుతోంది. త్వరలో పెన్షన్ అందుతుంది, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చేతికి వస్తాయని ఎదురుచూసే ఉద్యోగులకు షాకిచ్చింది. ముదిమి వయసులో ఆనందంగా రిటైర్ అవుతున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉద్యోగులను ఇబ్బందులు పెట్టేలా చర్యలు తీసుకోవడంపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా గా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ మంజూరు, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు సమయాలను పెంచడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అలవికాని హామీలతో..
ఎన్నికల సమయంలో కూటమి సర్కారు అన్ని వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం, కానుకలు ఇస్తాం అని అలవికాని హామీలను ఇచ్చింది. ఉపాధ్యాయ, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి వాగ్దానాలు గుప్పించింది. తీరా అధికారం చేపట్టిన తర్వాత నమ్మి ఓటేసిన వారిని నిండా ముంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చని సీఎం చంద్రబాబు తాజాగా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ మంజూరు వ్యవధిని రెట్టింపు చేశారు. ఈ నిర్ణయంతో పదవీ విరమణ తర్వాత పెన్షన్, ఇతరత్రా ప్రయోజనాల కోసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.
2 నెలల్లో.. 2,800 మంది..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది సుమారు 48 వేల మంది ఉన్నారు. ఏలూరు జిల్లాలో 20 వేల మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 18 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల కాలంలో ఏలూరు జిల్లాలో సుమారు 1,000 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 800 మంది ఉద్యోగ విరమణ పొందారు. వీరికి పెన్షన్ ప్రతిపాదనలను విజయవాడ కార్యాలయానికి పంపించి అక్కడి నుంచి సర్వీసు పెన్షన్, ఫామిలీ పెన్షన్‌లను మంజూరు చేయాల్సి ఉంటుంది. సర్వీస్ పెన్షన్ మంజూరు కోసం 45 రోజులు, ఫ్యామిలీ పెన్షన్ కోసం 90 రోజులు వ్యవధి ఉండగా.. కూటమి ప్రభుత్వం ఈ సమయాన్ని రెట్టింపు చేసింది. సర్వీస్ పెన్షన్ కోసం 90 రోజులు, ఫ్యామిలీ పెన్షన్ కోసం 180 రోజులు గడువు పొడిగించడంపై రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు 180 రోజులపాటు ఎదురుచూపులు తప్పవని అంటున్నారు. ఏళ్లపాటు విధులు నిర్వహించి గౌరవంగా ఉద్యోగ విరమణ చేసిన తమకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఇలా చేయడం తగదని వాపోతున్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు పరీక్షే
పెన్షన్ మంజూరు సమయం 90 రోజులకు పెంపు
ఫ్యామిలీ పెన్షన్ సైతం 6 నెలలకు పొడిగింపు
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసమూ తప్పని ఇబ్బందులు
కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 45 రోజుల్లోనే పరిష్కారం
ఉమ్మడి జిల్లాలో 38 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు
కుటుంబ సభ్యులకూ పాట్లు
ఉద్యోగి భార్య లేదా భర్త లేదా పిల్లలకు పెన్షన్ ఇవ్వడాన్ని ఫ్యామిలీ పెన్షన్‌గా వ్యవహరిస్తారు. ఫ్యామిలీ పెన్షన్‌ను గత ప్రభుత్వంలో 90 రోజుల్లోపు ప్రభుత్వం ఆమోదించేది. ప్రస్తుత కూటమి సర్కారులో 180 రోజులకు పెంచడంతో మరణించిన ఉద్యోగి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన పెన్షన్ కోసం ఆరు నెలలు ఎదురు చూడాల్సిందేనని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment