విద్యుదాఘాతంతో యువకుడి మృతి
జంగారెడ్డిగూడెం రూరల్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. మండలంలోని శ్రీనివాసపురానికి చెందిన తగరం కల్యాణ్ (31) పామాయిల్ తోటల్లో గెలల కోత పనులకు వెళ్తుంటాడు. సోమవారం శ్రీనివాసపురం శివారులో రైతు పొలంలో గెలల కోతకు కల్యాణ్ వెళ్లాడు. గెల కోస్తుండగా ఐరన్ పైపు తోట మీదుగా వెళ్లిన 11 కెవీ విద్యుత్ వైర్లకు తగలడంతో కల్యాణ్ విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కళ్యాణ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎస్సై జబీర్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.
పరిశోధన రంగంలో స్వావలంబన
తాడేపల్లిగూడెం: పరిశోధన, రక్షణ రంగాల్లో భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేస్తుందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ (డీఆర్‌డీఓ) శాస్త్రవేత్త, డిఫెన్సు మెటలర్జికల్ రీసెర్చ్ లేబరేటరీ పూర్వపు డైరెక్టర్ డాక్టర్ జి.మధుసూదన రెడ్డి అన్నారు. నిట్‌లో సోమవారం డీఆర్‌డీఓలో పరిశోధనలకు నిధులనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థలో డీఆర్‌డీఓ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. డీఆర్‌డీఓ ఆధునిక ఆఽయుధాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, తేలికపాటి యుద్ధ విమానాలు, రాడార్లు, క్షిపణులు, రాకెట్‌లు , అధునాతనమైన వివిధ పరికరాలు తయారుచేస్తుందన్నారు. దేశ రక్షణ పరిశోధనలకు సంబంధించి ఎన్‌ఐటీల భాగస్వామ్యం ఉండాలన్నారు. విద్యార్థులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ప్రపంచం గర్వించే నూతన ఆవిష్కరణల రూపకల్పనకు కృషి చేయాలన్నారు. పరిశోధనలకు నిధుల సమీకరణ కొత్త ప్రాజెక్టులు, డీఆర్‌డీఓలో ఉద్యోగ అవకాశాలు వంటి విషయాలపై విద్యార్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఎంఎంఈ విభాగాధిపతి డాక్టర్ రఫీ, డీన్‌లు శాస్త్రి, జయరామ్, కురుమయ్య, వీరేష్‌కుమార్, అసోసియేట్ డీన్ వి.సందీప్, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటేశ్వరరావు, అల్లా భక్షు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment