ఉన్ని దుస్తులకు గిరాకీ
ఉష్ణోగ్రతలు తగ్గడంతో
ఉన్ని దుస్తులకు డిమాండ్
గత నాలుగు రోజుల వరకు ఏలూరు నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 23 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ ఉన్ని దుస్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. రాత్రి పూట ప్రయాణం చేసే వాహనదారులు తప్పనిసరి ఉన్ని దుస్తులు వాడాలి. నగరంలోని పలు మాల్స్, వస్త్ర దుకాణాల్లో సమీప ప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తుంటారు. వీరి విధులు ముగిసేసరికి రాత్రి 8 నుంచి 9 గంటలవుతుంది. వీరంతా ఆ సమయంలో తప్పనిసరిగా ప్రయాణించాల్సిన పరిస్థితి. ఇలాంటి వారు చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులను తప్పనిసరిగా ధరించాలని వైద్యులు చెబుతున్నారు.
ఏలూరు (టూటౌన్): శీతాకాలం రాగానే నగరాలు, పట్టణాల్లో ఉన్ని దుస్తుల దుకాణాలు వెలుస్తాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వచ్చి వీరు దాదాపు మూడు నెలలు ఇక్కడే ఉండి ఉన్ని దుస్తుల అమ్మకాలు చేస్తారు. స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, మప్లర్‌లు, రగ్గులు ఇలా మనకు శీతాకాలంలో కావాల్సిన అన్ని దుస్తులు వీరి వద్ద అందుబాటులో ఉంటాయి. ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి వచ్చిన వ్యాపారులు ఏలూరులోని పలు ప్రాంతాల్లో విక్రయాలు చేస్తున్నారు.
నాణ్యత, డిజైన్‌ను బట్టి స్వెట్టర్ రూ.300 నుంచి రూ.700 వరకు ధర పలుకుతుంది. మంకీ క్యాప్‌లు రూ.70 నుంచి రూ.150, చేతి గ్లౌజులు రూ.100, రగ్గులు రూ.800 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతున్నాయి. ముడి సరుకుల ధరలు పెరుగుదల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రేట్లు కొంత మేర పెరిగాయని విక్రయదారులు, కొనుగోలుదారులు చెబుతున్నారు.
ఏలూరు నగరంలో ఎక్కువగా కెనాల్ రోడ్డులో ఈ దుకాణాలు దర్శనమిస్తున్నాయి. నవంబరు నెల ప్రారంభం నుంచి ఈ దుకాణాలను ఏర్పాటు చేసినా మొదటి పదిరోజులు అమ్మకాలు అంతంతమాత్రమే. గత నాలుగు రోజుల నుండి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అమ్మకాలు పెరిగాయి. దీంతో సాయంత్రం అయితే ఈ మార్గం కొనుగోలుదారులతో సందడిగా మారుతోంది.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో స్వెటర్లు, మంకీ క్యాప్‌లకు డిమాండ్
ఏలూరులో పలు చోట్ల వెలసిన దుకాణాలు
జనవరి చివరి వరకు అమ్ముతాం
ఏటా ఏలూరు నగరానికి ఉన్ని దుస్తుల అమ్మకం కోసం మధ్యప్రదేశ్ నుంచి వస్తాం. నవంబరు ప్రారంభంలో వచ్చి జనవరి చివరికి మా స్వగ్రామం వెళతాం. గత పది రోజులుగా సరిగా అమ్మకాలు లేవు. ఇప్పుడే మొదలవుతున్నాయి. ఇక్కడి ప్రజల ఆదరణ, మాట తీరు బాగుంది. తిరిగి వెళ్లేటప్పుడు సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్తున్న భావన కలుగుతుంది.
జి.చంద్ర సింగ్, మధ్యప్రదేశ్, అమ్మకందారుడు
ఏటా ఉన్ని దుస్తులు కొంటాం
ఏటా శీతాకాలం ఏలూరులో అమ్మే స్వెట్టర్ల దుకాణంలో మా కుటుంబానికి అవసరమైన వాటిని కొనుగోలు చేస్తుంటాం. మంకీ క్యాప్‌లు, చెవులకు పెట్టుకునే పట్టీలు, మప్లర్‌లు తప్పనిసరిగా కొంటాం. స్వెట్టర్లు, రగ్గులు అవసరం మేరకు కొనుగోలు చేస్తాం. నలుగురు ఉన్న మా కుటుంబంలో ప్రతీ సీజన్‌లో ఏదో రకం ఐటెమ్ కొనుగోలు చేయడం అలవాటు.
వెంపా విజయలక్ష్మి, మల్కాపురం, ఏలూరు రూరల్ మండలం
Comments
Please login to add a commentAdd a comment