గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ సాధ్యమేనా?
తాడేపల్లిగూడెం: గూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రతిపాదిత విమానాశ్రయాల్లో తాడేపల్లిగూడెం ఒకటి. అటవీ భూముల్లో సుమారు 1100 ఎకరాలకు పైగా కేటాయించి విమానాశ్రయం నిర్మించాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. గూడెంలో విమానాశ్రయ నిర్మాణం ఈ నాటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ సుమారు 653 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఉంది. 1.90 కిలోమీటర్ల పొడవున, సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో రన్‌వే ఉంది. వైఎస్ తొలిసారి సీఎం అయ్యాక ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రతిపాదన చేశారు. టెండర్ల వరకు వ్యవహారం వెళ్లింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం విండ్ క్లియరెన్సు సర్టిఫికెట్ ఉండటంతో విమానాశ్రయ ఏర్పాటుకు సత్యం కంప్యూటర్స్‌కు చెందిన మైటాస్ కంపెనీ టెండరు దక్కించుకుంది. సత్యం కంప్యూటర్స్ స్కామ్ నేపథ్యంలో విమానాశ్రయం ఏర్పాటుకాలేదు.
అటకెక్కిన కార్గొ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదన
పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా కార్గో విమానాశ్రయానికి ప్రతిపాదన చేశారు. అమెరికాలో ఉంటున్న భీమవరానికి చెందిన కుటుంబం బిల్డ్ అండ్ ఆపరేట్ పద్ధతిలో విమానాశ్రయం నిర్మించడానికి ఆమోదం తెలిపింది. అయితే అది కూడా రన్‌వే మీదకు ఎక్కలేదు. ఇదే సమయంలో విమానాశ్రయ భూముల్లో రన్‌వేతో సహా 171.80 ఎకరాల భూమిని ఏపీ నిట్‌కు కేటాయించారు. ఈ రెండు ప్రతిపాదనలు విజయవంతం కాకపోవడంతో ఇజ్రాయెల్ సహకారంతో వెంకట్రామన్నగూడెంలోని కేంద్ర అటవీ పర్యావరణ ప్రాంతంలో ఉన్న భూముల్లో పైలట్ రహిత విమాన విడిభాగాల తయారీ కేంద్రం ఏర్పాటుతో పాటు విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అప్పటి కేంద్ర విమానయాన మంత్రి అశోకగజపతిరాజు భూమి ఇస్తే విమానాశ్రయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సివిల్ ఏవియేషన్ పాలసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంటు ఫండ్ కింద రూ.100 కోట్లను కార్పస్ ఫండ్‌గా కేటాయించింది. చివరకు ఆ ప్రతిపాదన ఫలించలేదు. ఉంగుటూరు, నాచుగుంట, గోపీనాథపట్నం పంచాయతీలు తమ పంచాయతీ పరిధిలోని అటవీ భూములను విమానాశ్రయ నిర్మాణానికి వినియోగించుకోవచ్చని తీర్మానాలు చేశాయి.
ఎయిర్‌పోర్టు ఇక్కడ సాధ్యమేనా?
తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మించాలంటే గూడెం, ఉంగుటూరు నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ పరిఽధిలోని సుమారు 3033 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని డీ నోటిఫై చేసి ఇవ్వాలి. వైఎస్ హయాంలో ఏర్పాటైన డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ కోసం అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ 50 ఎకరాలు అదనంగా కావాలనే ప్రతిపాదన చేశారు. అప్పటి రాష్ట్ర అటవీ పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రఘువీరారెడ్డి వర్సిటీని సందర్శించారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి హోదాలో జై రాం రమేష్ ఈ భూమిని కేటాయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. బెంగళూరులోని చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్టు కార్యాలయం చుట్టూ సంబంధిత ఫైల్ చక్కర్లు కొడుతోంది. భూమిని ఇన్ని సంవత్సరాలు గడిచినా కేటాయించలేదు. ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్న గూడెంలో విమానాశ్రయం ఏర్పాటు ఈ దశలో వర్కవుట్ అవుతుందా? అనే చర్చ సాగుతోంది.
1100 ఎకరాల అటవీ భూముల్లో
నిర్మించాలనే ప్రతిపాదన
అటవీ భూమిలో నిర్మాణంపైపలు సందేహాలు
Comments
Please login to add a commentAdd a comment