అవినీతి ఆరోపణలపై డీఎస్పీ విచారణ
తణుకు: తణుకు మండలం వేల్పూరులో గేదెల అపహరణ కేసులో పోలీసు స్టేషన్‌లో లక్షలు చేతులు మారినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోమవారం పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాఽథ్ తణుకు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. అత్తిలి మండలం బల్లిపాడుకు చెందిన ఆకుల మారుతీ అయ్యన్నరావుకు చెందిన రెండు గేదెలను వీరభద్రపురం గ్రామానికి చెందిన చికెన్ వ్యాపారి బండి ఈశ్వరరావు అపహరించుకుపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన తణుకు రూరల్ పోలీసులు రికవరీ పేరుతో బాధితుడు అయ్యన్నరావుకు రూ.5 లక్షలు అందజేశారు. అయితే ఈశ్వరరావు వద్ద రూ.13 లక్షలు తీసుకున్నారని.. తనకు రూ. 5 లక్షలు మాత్రమే ఇచ్చారని బాధితుడు అయ్యన్నరావు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఈశ్వరరావు, అయ్యన్నరావు మధ్య గతంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం.
వ్యాన్ బోల్తా
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని గొల్లవానితిప్పలో వంతెనకు అప్రోచ్ లేకపోవడంతో సోమవారం ఆటో వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్‌లో ఎవరూ లేకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. గొల్లవానితిప్ప నుంచి చేపల లోడుతో ఆటో వ్యాన్ రామాయణపురం వైపునకు వంతెనపై నుంచి దిగుతుండగా అదుపుతప్పి పంట కాలువలో పడిపోయింది. డ్రైవర్ సమయ స్ఫూర్తితో కిందకు దిగడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వ్యాన్‌లో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత
కొయ్యలగూడెం: పోగొట్టుకున్న బంగారు గొలుసును రికవరీ చేసి బాధితునికి అందజేశారు. కొయ్యలగూడెంకు చెందిన గొలిశెట్టి ఉషారాణి సోమవారం స్వీట్‌షాప్‌కు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా మెడలోని మూడు కాసుల బంగారు గొలుసు పడిపోయింది. గొలుసు కొయ్యలగూడెంకి చెందిన మరో మహిళ ఆకుల లక్ష్మికి దొరికింది. ఇంటికి వెళ్లి చూసుకున్న ఉషారాణి గొలుసు కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ వి.చంద్రశేఖర్, ఈ–కాప్ కానిస్టేబుల్ సీహెచ్ గణేష్‌లు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా గొలుసు తీసుకున్న మహిళను గుర్తించి రికవరీ చేశారు. అనంతరం బాధితురాలికి దానిని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment